AP:సీఎం ఆదేశాల మేరకు హార్సిలీ హిల్స్‌లో పర్యాటకం పై ప్రత్యేక దృష్టి:జిల్లా కలెక్టర్
అన్నమయ్య జిల్లా మదనపల్లి లోని హార్సిలీ హిల్స్ పర్యాటక కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మరియు జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ సందర్శించారు.
దిశ,రాయచోటి:అన్నమయ్య జిల్లా మదనపల్లి లోని హార్సిలీ హిల్స్ పర్యాటక కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మరియు జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయుటకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని, ఈ రంగంలో ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. బి కొత్తకోట మండలంలోని హార్స్లీ హిల్స్ కు పర్యాటకంలో ఒక ప్రత్యేక స్థానం ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఈ నెల 5న జరిగిన కలెక్టర్ల సదస్సులో పర్యాటక శాఖ పై కలెక్టర్లు అందరూ ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
ఆయన ఆదేశాల మేరకు హార్సిలీ హిల్స్ ఒక పర్యాటక హబ్‌గా తయారు చేయబోతున్నామన్నారు. హార్సిలీ హిల్స్ లో ఏడు నక్షత్రాల హోటల్ ను ప్రభుత్వ మరియు ప్రైవేటు భాగస్వామ్యంతో ఒబెరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ వారు నిర్మాణం చేయుటకు గాను సుమారు 20 ఎకరాల భూమిని పర్యాటక శాఖకు ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఈ నేపథ్యంలో ఈ హోటల్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయుటకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఆదేశాల మేరకు ఈ భూమిని పరిశీలించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్, జిల్లా పర్యాటక శాఖ అధికారి నాగభూషణం, ఏడీ సర్వే జయరాజ్, తదితరులు పాల్గొన్నారు.