AP News:నామినేటెడ్ పోస్టులు త్వరలో భర్తీ..కూటమి పార్టీల మధ్య కీలక ఒప్పందం

రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం త్వరలో తీపి కబురు చెప్పనుంది.

Update: 2024-07-26 02:06 GMT

దిశ,ఏపీ బ్యూరో:రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం త్వరలో తీపి కబురు చెప్పనుంది. నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి కూటమి పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. నామినేటెడ్ పోస్టుల భర్తీ ఈ నెల 28న లేదా ఆగస్టు 6న ప్రకటించే అవకాశం ఉంది. ఎమ్మెల్యే టికెట్లు ఆశించి నిరాశకు గురైన వారు టీడీపీ, జనసేన పార్టీల్లో చాలా మందే ఉన్నారు. నిరాశకు గురైన నాయకుల్లో ఎక్కువ మంది నామినేటెడ్ పోస్టుల కోసం పోటీ పడుతున్నారు.

ఒప్పందం ఇలా..

ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి భంగపాటుకు గురైన వారే కాకుండా పార్టీ కోసం కష్టపడిన వారు సైతం నామినేటెడ్ పోస్టులను ఆశిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలున్న చోట 60 శాతం నామినేటెడ్ పోస్టులు ఆ పార్టీ కార్యకర్తలకు, 30 శాతం జనసేనకు, మిగతా 10 శాతం బీజేపీకి ఇచ్చేటట్లు ఒప్పందం కుదిరింది. అలాగే జనసేన ఎమ్మెల్యేలున్న చోట 60 శాతం పోస్టులు ఆ పార్టీకి 30 శాతం పోస్టులు టీడీపీకి, 10 శాతం బీజేపీ వారికి కేటాయిస్తారు. బీజేపీ ఎమ్మెల్యేలున్న చోట ఆ పార్టీకి 50 శాతం పదవులు, మిగిలిన 50 శాతం టీడీపీ, జనసేనలకు ఇవ్వనున్నట్లు సమాచారం.


Similar News