విశాఖలో సీజీహెచ్ఎస్ స్టేట్ డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయండి: కేంద్రాన్ని కోరిన ఎంపీ జీవీఎల్
విశాఖపట్నంలో సీజీహెచ్‌ఎస్ స్టేట్ డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖపట్నంలో సీజీహెచ్‌ఎస్ స్టేట్ డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. అలాగే అదనపు సీజీహెచ్ఎస్ వెల్‌నెస్ సెంటర్‌లను కూడా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి కోరారు. ఎంపీ జీవీఎల్ ప్రతిపాదనలను తక్షణమే సమీక్షించి, పరిశీలించాల్సిందిగా కేంద్ర ఆరోగ్య కార్యదర్శి అధికారులను ఆదేశించారు. ఎంపీ జీవీఎల్ నరసింహారావు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సుధాంష్ పంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖపట్నంలో ప్రధాన కార్యాలయంతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సిజిహెచ్‌ఎస్ స్టేట్ డైరెక్టరేట్ ఏర్పాటు కోసం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నంలో ప్రస్తుతం ఉన్న సీజీహెచ్ఎస్ సౌకర్యాలు సరిపోవని, కొత్త వెల్‌నెస్ సెంటర్లు మంజూరు చేయాలని ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు.
ఏపీకి సీజీహెచ్ఎస్ ఉండాల్సిందే
2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కూడా హైదరాబాద్‌లో సీజీహెచ్ఎస్ కార్యాలయం కొనసాగుతున్న కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని మరియు ముఖ్యంగా విశాఖపట్నంలోని సీజీహెచ్ఎస్ కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. దేశంలోని ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక సీజీహెచ్‌ఎస్ రాష్ట్ర కార్యాలయం ఉందని, హైదరాబాద్ నుంచి సీజీహెచ్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని ఏపీకి తరలించాల్సిన అవసరం ఉందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు లేఖలో పేర్కొన్నారు. విశాఖపట్నంలో కనీసం మరో వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటుకు తక్షణమే అనుమతి ఇవ్వాలని, సీజీహెచ్‌ఎస్ కార్యకలాపాలకు తగిన సిబ్బందిని నియమించాలని ఎంపీ జీవీఎల్ కోరారు. విశాఖపట్నంలో చాలా కాలంగా సీజీహెచ్‌ఎస్ భవన నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 30 సెంట్ల స్థలాన్ని సేకరించేందుకు రూ.2.9 కోట్లు విడుదల చేయాలని ఎంపీ జీవీఎల్ కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిని కోరారు. అన్ని అభ్యర్థనలపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి చాలా సానుకూలంగా స్పందించారని ఎంపీ జీవీఎల్ తెలిపారు. అన్ని ప్రతిపాదనలను అనుకూలంగా పరిశీలించాలని మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించినట్లు ఎంపీ జీవీఎల్ వెల్లడించారు.