విద్యార్థుల ముఖంలో చిరునవ్వు చూస్తే.. సంక్రాంతి ముందే వచ్చినట్టు అనిపించింది: మంత్రి లోకేష్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి నారా లోకేష్ శనివారం మధ్యాహ్నం విజయవాడలో ప్రారంభించారు.

Update: 2025-01-04 11:40 GMT

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డొక్కా సీతమ్మ(Dokka Seethamma) మధ్యాహ్న భోజన పథకాన్ని(Mid-Day Meal Scheme) మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh)  శనివారం మధ్యాహ్నం విజయవాడలో ప్రారంభించారు. అనంతరం ఆయన విద్యార్థులతో కలిసి ముచ్చటిస్తూ.. వారితో పాటే కూర్చోని మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం నారా లోకేష్ ట్వీట్ చేశారు. అందులో ఇలా రాసుకొచ్చారు. విద్యార్థుల ముఖాల్లో చిరునవ్వు చూసిన తరువాత సంక్రాంతి ముందే వచ్చినట్టు అనిపించింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తుంది ప్రజా ప్రభుత్వం. గత ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్, మధ్యాహ్న భోజన పథకాలు ఆపేసింది. నిరుపేద కుటుంబాల పై భారం తగ్గించాలనే ఉద్దేశంతో నేను మంత్రి అయిన వెంటనే డాక్టర్. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరుతో ఉచితంగా టెక్స్ట్ బుక్స్ అందజేశాం.

ఈ రోజు 475 ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాం. ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీలో చదువుతున్న 1.48 లక్షల విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం అందించడానికి ఏడాదికి రూ.86 కోట్లు ఖర్చు అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు కృతజ్ఞతలు. విజయవాడ పాయకాపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. అక్కడ విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నాను. రానున్న కాలంలో ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీలను మరింత అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం" అని మంత్రి తన ట్వీట్ లో రాసుకొచ్చారు.


Similar News