AP News:కరువైన ఉపాధి.. ప్రభుత్వం ఎదుట లారీ యజమానుల కీలక డిమాండ్

కాకినాడ లారీ యజమానుల అసోసియేషన్‌లో అందరికీ సమాన పని కల్పించేలా తగు చర్యలు తీసుకోవాలని లారీ యజమానులు కోరారు.

Update: 2024-10-15 10:36 GMT

దిశ, కాకినాడ: కాకినాడ లారీ యజమానుల అసోసియేషన్‌లో అందరికీ సమాన పని కల్పించేలా తగు చర్యలు తీసుకోవాలని లారీ యజమానులు కోరారు. కాకినాడలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మంగళవారం అసోసియేషన్‌కు చెందిన లారీ యజమానులు నిరసన వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టులో ఎగుమతి, దిగుమతులు బాగా తగ్గాయని అందువల్ల తమకు ఉపాధి కరువై చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. అలాగే తమ సభ్యుల అనుమతులు లేకుండా ఒక యూనియన్ ఎంపిక జరిగిందని అది తమ నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో దాన్ని తిరిగి రద్దుచేసి తిరిగి ఎన్నికల నిర్వహించేలా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు), కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు (నానాజీ)లను కోరామన్నారు.

ఈ యూనియన్‌లో కొందరు సభ్యులు గతంలో అసోసియేషన్‌కు చెందిన నగదును దుర్వినియోగానికి పాల్పడి అవకతవకలు చేశారని వారు చెప్పారు. దీనిపై నానాజీ వారం రోజుల్లో మంచి నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్నారు. కాకినాడ అసోసియేషన్‌పై సుమారు పదివేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని అందువల్ల ఈ సమస్య పై శ్రద్ధ వహించాలని కోరారు. ఇదే యూనియన్ కొనసాగితే తాము రూరల్లో వేరే యూనియన్ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అటువంటివి ఏమి రాకుండా ఇద్దరు ఎమ్మెల్యేలు సమస్యలు పరిష్కరించాలని సూచించారు.


Similar News