ప్రజలు కూడా అదే అడుగుతున్నారు..వై ఏపీ నీడ్స్ జగన్ అని: నారా లోకేశ్ సెటైర్లు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ‘వై ఏపీ నీడ్స్ జగన్’ అనే కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది.
దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ‘వై ఏపీ నీడ్స్ జగన్’ అనే కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని వైసీపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంపై నారా లోకేశ్ సెటైర్లు వేశారు. ఏపీకి జగన్ ఎందుకు కావాలి అని ప్రశ్నిస్తూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజలు కూడా అదే అడుగుతున్నారు అని చెప్పుకొచ్చారు. జగన్ చేయగలిగింది కేవలం రాష్ట్రాన్ని దోచుకోవడం, నాశనం చేయడం మాత్రమే అయినప్పుడు ఏపీకి ఆయన ఎందుకు అవసరం? అని నారా లోకేశ్ ప్రశ్నించారు.
వైసీపీ లక్ష్యాలు ఇవే..
ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ‘వై ఏపీ నీడ్స్ జగన్’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని నవంబర్ తొమ్మిది నుంచి ప్రారంభించింది. ఇప్పటికే ఈ కార్యక్రమంపై గత నెలలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలోనే సీఎం వైఎస్ జగన్ పలు సూచనలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్లేలా ఒకవైపు ప్రభుత్వ పరంగానూ... మరోవైపు పార్టీ పరంగానూ కార్యచరణ సిద్ధం చేసింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ద్వారా జరుగుతున్న మంచిని అందరికీ తెలియజేయడమే వైసీపీ లక్ష్యం. గ్రామాల వారీగా ఎంత నగదు బదిలీ ఇచ్చాం, ఎంతమందికి ఎలా లబ్ధి జరిగింది అనేది ప్రతీ ఇంటికి వెళ్లి వివరించాలని వైసీపీ, ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల వారీగా ఏయే పథకాల ద్వారా లబ్ధిపొందారో చెప్పాలని, ఆ గ్రామంలో ఎంత మంచి జరిగిందో చెప్పాలని దిశానిర్దేశం చేశారు. ఏ పథకం ఎలా పొందాలో వారికి తెలియాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు.ఈ మేరకు కలెక్టర్లకు దీనికి సంబంధించి పలు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే ఈ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని... ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న పార్టీ వైసీపీ తప్ప మరొకటి లేదని ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. మరోవైపు సామాజిక వర్గాలకు, ప్రాంతాలకు సమన్యాయం చేశామని సీఎం జగన్ ఇప్పటికే తెలియజేశారు. మూడు ప్రాంతాల ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేలా మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నట్లు సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా, ఓ బాధ్యతగా అధికారాన్ని చేపట్టామని జగన్ వివరించారు. ప్రజలకు తొలి సేవకుడిగా పాలన అందిస్తున్నాం. కాబట్టే ఈ 53 నెలల కాలం చరిత్రలో నిలిచేలా మారిందని సీఎం వైఎస్ జగన్ ఇటీవలే వివరించిన సంగతి తెలిసిందే. ఇవే లక్ష్యాలతో వైసీపీ నాయకులు, ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్లనుంది.