ఈసారి పవన్ కల్యాణ్ టార్గెట్ ఎవరు?: విశాఖ నుంచి మూడో విడత వారాహి యాత్ర

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడో విడత వారాహి విజయయాత్రకు రెడీ అయ్యారు.

Update: 2023-08-03 10:09 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడో విడత వారాహి విజయయాత్రకు రెడీ అయ్యారు. మెుదటి రెండు విడతలు ఉభయగోదావరి జిల్లాలలో పవన్ వారాహి విజయయాత్ర చేపట్టారు. అయితే మూడో విడత వారాహి విజయయాత్రను విశాఖపట్నంలో చేపట్టనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర తదుపరి విడత విశాఖపట్నం నగరం నుంచి మొదలవుతుంది అని ప్రకటించారు. ఈ మేరకు పార్టీ నాయకులను అలర్ట్ చేశారు. వారాహి విజయయాత్రకు అన్ని ఏర్పాట్లు చేయాలని నాదెండ్ల మనోహర్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చాయి. పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర ఏపీ రాజకీయాల్లో ఒక సన్సేషనల్‌గా మారింది. పవన్ కల్యాణ్ వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఒక్కోసారి వ్యక్తులను మరో విడతలో వ్యవస్థలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు. తాజాగా మూడో విడత యాత్రకు సన్నాహకాలు జరుగుతున్న నేపథ్యంలో ఈసారి ఎవరిని పవన్ కల్యాణ్ టార్గెట్ చేస్తారోనన్న ప్రశ్నలు ఉత్తరాంధ్రలో పెద్ద చర్చ జరుగుతుంది. మూడో విడతలో మూడేది ఎవరికి అని జనసైనికులు సైతం ఆసక్తిగా చూస్తున్నారు.

విశాఖ నేతలతో నాదెండ్ల మనోహర్

మూడో విడత వారాహి విజయయాత్ర విశాఖపట్నం నుంచి ప్రారంభం కానుందని జనసేన అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ యాత్ర విజయవంతం చేయడానికి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకులతో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గురువారం సన్నాహక సమావేశం నిర్వహించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ‘ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు విడతల్లో నిర్వహించిన వారాహి విజయ యాత్ర విజయవంతంగా సాగింది. అంతకు మించిన స్థాయిలో విశాఖ నగరంలో చేసే యాత్ర ఉండాలి. నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అంతా సమష్టిగా పని చేసి వారాహి యాత్ర ఉద్దేశాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్లాలి. యాత్రలో భాగంగా జనవాణి కార్యక్రమం విశాఖలో ఉంటుంది. అదే విధంగా క్షేత్ర స్థాయి పరిశీలనలు చేపట్టి, సంబంధిత ప్రజలతో పవన్ కల్యాణ్ సమావేశమై సమస్యలను తెలుసుకుంటారు’అని పవన్ కల్యాణ్ తెలిపారు.

జనసేనలో ఉత్సాహం

జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్రలో పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుంది. అంతేకాదు రాష్ట్ర రాజకీయాల్లో హల్‌చల్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర మెుదటి విడతలో ఎమ్మెల్యేలను టార్గెట్‌గా చేసుకుని పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇదే సందర్భంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేయడంతోపాటు వచ్చే ఎన్నికల్లో ఓడించి తీరుతామని శపథం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలు ఏకంగా కాపు సామాజిక వర్గంలో చీలిక తీసుకురావడంతోపాటు వారం రోజులపాటు వీరిమధ్యే రాజకీయ పోరు నడిచింది. ఇక రెండో విడత వారాహి విజయయాత్రలో పవన్ కల్యాణ్ వలంటీర్ వ్యవస్థపై చేసిన ఆరోపణలు ఇప్పటికీ వణుకు పుట్టిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మూడో విడత యాత్రలో పవన్ కల్యాణ్ ఎవరిని టార్గెట్ చేస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది.


Similar News