ఇంఛార్జుల మార్పుపై కొనసాగుతున్న కసరత్తు..
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయం దగ్గర పడుతుంది.
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. అయినా నేటికీ వైసీపీలో ఇన్చార్జిల మార్పు కొనసాగుతూనే ఉంది. వైసీపీ అధిష్టానం నిర్వహిస్తున్న మార్పులు చేర్పుల నేపద్యంలో ఇప్పటికే అసంతృప్తితో కొందరు నేతలు పార్టీలు మారారు. మరికొందరు పార్టీలు మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయినా వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ మాత్రం తన ధోరణి మార్చుకోవడం లేదు. ఇప్పటికీ వైసీపీలో ఇన్చార్జిల మార్పుని కొనసాగిస్తూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా టికెట్ విషయంలో చర్చించేందుకు పలువురికి పార్టీ పెద్దల నుంచి పిలుపు అందింది. దీనితో వైసిపి నేతలు తాడేపల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేష్, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, జక్కంపూడి రాజా, ప్రసన్న కుమార్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ,కాసు మహేష్ రెడ్డి సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యలు కూడా క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఇక సీఎం జగన్ తో మంత్రి జోగు రమేష్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో మంత్రి తన సీటు విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే పెడన నియోజకవర్గం పై ఇంకా స్పష్టత రాలేదు. దీనిపైన కూడా త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల వర్గాల నుండి అందుతున్న సమాచారం.