సెల్ఫీలతో కాదు..దమ్ముంటే ప్రజాక్షేత్రంలో చర్చకు రండి: టీడీపీకి మల్లాది విష్ణు సవాల్

మంచి చేస్తున్న ప్రభుత్వంపై టీడీపీ ముప్పేట దాడికి దిగుతుందని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు.

Update: 2023-08-29 08:46 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : మంచి చేస్తున్న ప్రభుత్వంపై టీడీపీ ముప్పేట దాడికి దిగుతుందని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో సీఎం వైఎస్ జగన్ ప్రజల హృదయాలలో సుస్థిరంగా, చెరగని ముద్ర వేసుకుంటున్నారని అది ఓర్వలేక ఈ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ముప్పేట దాడికి దిగుతున్నాయని మండిపడ్డారు. పేదలకు చేస్తున్న మంచిని కూడా తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. టీడీపీ పాలనలో పదేళ్లు వెనక్కి వెళ్లిన విజయవాడ నగరానికి.. వైఎస్ జగన్ సీఎం అయ్యాక కొత్త కళ వచ్చిందన్నారు. ప్రతీ సచివాలయ పరిధిలోనూ అర్హులైన పేదలకు కోట్లాది రూపాయల సంక్షేమాన్ని అందిస్తుండటంతో పాటు.. నగరంలోనూ రూ. వందల కోట్ల నిధులతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నట్లు వెల్లడించారు. తమను గెలిపించిన ప్రజలకు చేసిన మంచిని గడప గడపకు వెళ్లి తాము చెప్పగలమని.. టీడీపీ హయాంలో పేదలకు ఏం చేశారో చెప్పే ధైర్యం గత పాలకులకు ఉందా..? అని సూటిగా ప్రశ్నించారు. సెల్ఫీలతో ప్రజలను మభ్యపెట్టడం కాదని,దమ్ముంటే ప్రజాక్షేత్రంలో చర్చకు రావాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు.

దొంగ ఓట్ల పాపం ముమ్మాటికీ చంద్రబాబుదే

రాష్ట్రంలో దొంగ ఓట్ల పాపం ముమ్మాటికీ చంద్రబాబుదేనని ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల దొంగ ఓట్లు నమోదయ్యాయని, వీటిపై గతంలోనూ తాము పోరాడినట్లు గుర్తుచేశారు. అప్పట్లో ఈ అంశాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకువెళ్లామని.. వైఎస్ జగన్‌ నాయకత్వంలో ఎంపీలందరూ ఢిల్లీకి వెళ్లి పిటీషన్లు కూడా వేసినట్లు తెలిపారు. ఆనాడు వ్యవస్ధల్ని మేనేజ్ చేసి బాబు చేసిన అక్రమాలు అన్నీఇన్నీ కావని.. ఒక్క కుప్పంలోనే 30 - 40 వేల దొంగ ఓట్లు బయటపడ్డాయని మల్లాది విష్ణు ఆరోపించారు. అటువంటిది మరలా ఏ ముఖం పెట్టుకుని చంద్రబాబు ఎలక్షన్ కమిషన్ ను కలుస్తారని ప్రశ్నించారు. టీడీపీ గతంలో చేసిన తప్పుల్ని తాము సరిచేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. చనిపోయిన వారి ఓట్లు, డబుల్ ఓట్లను తొలగిస్తుంటే చంద్రబాబుకి ఎందుకంత ఉలికిపాటు..? అని పేర్కొన్నారు. ఓటమిని ముందుగా గ్రహించే వారి హయాంలో నమోదు చేసిన దొంగ ఓట్లను కాపాడుకోవడానికి ప్రతిపక్షనేత ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారని మల్లాది విష్ణు ఆరోపించారు. చంద్రబాబు కుట్రలను సమర్థవంతంగా తిప్పికొడతామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు హెచ్చరించారు. 

Tags:    

Similar News