బీసీలకు సీట్ల కేటాయింపుల్లో ప్రాంతీయ పార్టీల నిర్లక్ష్యం : ఎంపీ జీవీఎల్ నరసింహారావు
ఏపీలో బీసీలకు అసెంబ్లీ, పార్లమెంటులలో తగినన్ని సీట్లు కేటాయించట్లేదని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో బీసీలకు అసెంబ్లీ, పార్లమెంటులలో తగినన్ని సీట్లు కేటాయించట్లేదని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. బీసీలకు సీట్ల కేటాయింపుల విషయంలో ప్రాంతీయ పార్టీలు తప్పుడు విధానాలను అవలంభిస్తున్నాయని ఆరోపించారు. విశాఖపట్నంలో ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ చేనేతల ఆత్మీయ సదస్సు జరిగింది. ఈ సమావేశానికి ఎంపీ జీవీఎల్ నరసింహారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి ఒక్క వెనుకబడిన సామాజిక వర్గానికి రాజకీయ, ఆర్థిక సాధికారత చేకూర్చేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అన్ని వెనుకబడిన తరగతుల వారు సమైక్యంగా ఉండి వారి సమస్యలపై కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది అని ఎంపీ జీవీఎల్ పిలుపునిచ్చారు. జనాభాలో 50 శాతానికి పైగా బీసీ జనాభా ఉన్నప్పటికీ చట్టసభల్లో కేవలం 15 శాతానికే పరిమితం అవ్వడం దురదృష్టకరం అని అభిప్రాయపడ్డారు. కేవలం ఆర్థిక బలంతోనే రాజకీయాలను శాసించడానికి ప్రయత్నం చేయటం ఉన్నత వర్గాలు చేస్తున్నటువంటి దురదృష్టకర రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఇది పెట్టుబడిదారీ రాజకీయ వ్యవస్థకు నిదర్శనం అని చెప్పుకొచ్చారు. అన్ని సామాజిక వర్గాలకు దామాషా ప్రకారం రాజకీయ సాధికారత సిద్ధించాలి కానీ ఈ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేకపోవడం దురదృష్టం అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో అన్ని బీసీ వర్గాల వారు సమైక్యంగా ఉండి తమకున్న సంఖ్యాబలం ప్రకారం రావలసిన రాజకీయ సాధికారత కోసం కలిసి కృషి చేయాలి అని ఎంపీ జీవీఎల్ పిలుపునిచ్చారు. ఇప్పటివరకు చేనేత వర్గం వారు రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ వారికి జరగాల్సిన న్యాయం విషయంలో గొంతు పెంచి మాట్లాడిన సందర్భంగానీ డిమాండ్ చేసిన పరిస్థితి కానీ ఇప్పటివరకు లేదు అని గుర్తు చేశారు. ఏపీలో రిజర్వేషన్లు పోను 140 సాధారణ కేటగిరి అసెంబ్లీ సీట్లు ఉండగా, కేవలం రెండు కులాలకు చెందిన వారే సగానికి పైగా ఉండటం బీసీలకు, ఇతర కులాలకు అన్యాయం జరుగుతుందని ఎంపీ జీవీఎల్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో బీసీలను విభజించి పాలించే సిద్ధాంతాన్ని అనుసరిస్తూ కేవలం కొన్ని సామాజిక వర్గాలు మాత్రమే అధికారాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్న పరిస్థితి మారాలి అని ఎంపీ జీవీఎల్ నరసింహారావు సూచించారు.