‘Kadapa ఉక్కు’లో కదలికేదీ?

కడప ఉక్కు ఆశలు ఇప్పట్లో నెరవేరేట్లు కనిపించడం లేదు. భూమి పూజ చేసి నాలుగు నెలలైనా కదలిక కనిపించడం లేదు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో భాగంగా చేపట్టే రోడ్డు పనులు తప్ప మిగతా పనుల్లో పురోగతి కనిపించడం లేదు. 24 నెలల్లో

Update: 2023-06-21 04:01 GMT

కడప ఉక్కు ఆశలు ఇప్పట్లో నెరవేరేట్లు కనిపించడం లేదు. భూమి పూజ చేసి నాలుగు నెలలైనా కదలిక కనిపించడం లేదు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో భాగంగా చేపట్టే రోడ్డు పనులు తప్ప మిగతా పనుల్లో పురోగతి కనిపించడం లేదు. 24 నెలల్లో మొదటి దశ ఉక్కు ఉత్పత్తులను తీసుకొస్తామని భూమి పూజ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చెప్పారు. ఇందులో ఇప్పటికే నాలుగు నెలలు గడిచాయి. ఇక మిగిలిన 20 నెలల్లో మొదటి దశ పనులు పూర్తి కావడం సాధ్యమేనా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

దిశ ప్రతినిధి, కడప: కడప ఉక్కు పరిశ్రమ దశాబ్దంన్నర కాలంగా నెరవేరని కలగా మారింది. ఇప్పటికి మూడు చోట్ల మూడుసార్లు శంకుస్థాపన చేశారు. మూడోసారి సున్నపురాళ్లపల్లె వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం 2019 డిసెంబర్ 23న శంకుస్థాపన చేశారు. అప్పట్లో మూడేళ్లలో ఉక్కు పరిశ్రమ పూర్తి చేస్తామని చెప్పినా అది జరగలేదు. మూడేళ్ల తర్వాత భూమి పూజ జరిగింది. అయితే భూమిపూజ సందర్భంగా ఉక్కు పరిశ్రమ 24 నెలల్లో పూర్తవుతుందని ఆ పరిశ్రమలు చేపట్టబోయే యాజమాన్యం ముందే చెప్పారు. 24 నెలల్లో రూ.3500 కోట్లతో 10 లక్షల టన్నుల ఉత్పత్తి తీసుకొస్తామని, ఆ తర్వాత ఐదేళ్లలో మరో ఐదు వేల కోట్లు ఖర్చు చేసి మొత్తం రూ.800 కోట్లతో మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తితో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అవుతుందని పేర్కొంది. ఆ తర్వాత మరింత ఉత్పత్తి సామర్థ్యంతో ఉక్కు పరిశ్రమ ముందుకు సాగుతుందని వెల్లడించారు. భూమి పూజ జరిగి ఇప్పటికి నాలుగు నెలలైనా మౌలిక వస్తువులకు సంబంధించిన పనులు తప్ప పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి పనుల్లో పురోగతి కనిపించడం లేదు. ఈ కారణంగా ఉక్కు పరిశ్రమ అనుకున్న సమయానికి పూర్తవుతుందన్న నమ్మకంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు తోడు త్వరలో ఎన్నికలు రానుండడంతో ఈ ప్రభావం కూడా ఉక్కు పరిశ్రమపై పడవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

 పురోగతిలో రోడ్డు పనులు

ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు రూ.700 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు అప్పట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇందులో భాగంగా జమ్మలమడుగు - ముద్దనూరు జాతీయ రహదారి నుంచి 7.5 కిలోమీటర్ల రోడ్డు, ప్రొద్దుటూరు- ఎర్రగుంట్ల రైలు మార్గం నుంచి పది కిలోమీటర్లు రైల్వే లైను, గండికోట నుంచి రెండు టీఎంసీల నీటి సరఫరా, అలాగే 220 కేవీ సబ్ స్టేషన్ సౌకర్యాలు కల్పించనునట్లు చెప్పారు. వీటిలో జమ్మలమడుగు- ముద్దనూరు జాతీయ రహదారి నుంచి చేపట్టిన రోడ్డు పనులు మాత్రం పురోగతిలో కనిపిస్తున్నాయి. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం అవసరమైన మౌలిక వసతులను వెంటనే చేపడితే కానీ ఉక్కు పరిశ్రమకు సంబంధించిన పనులు చేపట్టేటట్లు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల కారణంగా జమ్మలమడుగు మండలం సున్నపు రాళ్ళపల్లె వద్ద ముచ్చటగా మూడో సారి శంకుస్థాపన జరిగిన కడప పరిశ్రమ కూడా అనుకున్న సమయానికి పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించడంతోపాటు ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన పనులు వైపు దృష్టి పెడితే వచ్చే ఎన్నికల నాటికైనా కొంతైనా పురోగతి కనిపిస్తుందని ఆశించవచ్చు.‘కడప ఉక్కు’లో కదలికేదీ?


Tags:    

Similar News