Nara Lokesh : సీఐడీ కార్యాలయానికి నారా లోకేష్.. IRR కేసులో విచారణ

ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

Update: 2023-10-10 05:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఐడీ విచారణకు హాజరయ్యారు. అమరావతిలోని సీఐడీ కార్యాలయానికి చేరుకుని స్వయంగా విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో నారా లోకేష్ పేరును ఏ-14గా ఎఫ్‌ఐఆర్‌లో సీఐడీ పొందుపర్చింది. దీంతో ఇటీవల హైకోర్టు ఆదేశాలతో ఢిల్లీ వెళ్లిన సీఐడీ అధికారులు.. లోకేష్‌కు సెక్షన్ 41ఏ కింద నోటీసులు అందించారు.

ఉదయం 10 గంటలకు లోకేష్ విచారణకు హాజరవ్వగా.. సాయంత్రం 5 వరకు విచారణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మార్పుపై లోకేష్‌ను సీఐడీ ప్రశ్నించనుంది. మధ్యాహ్నం గంట పాటు లోకేష్‌కు సీఐడీ లంచ్ బ్రేక్ ఇవ్వనుంది. అనంతరం తిరిగి మళ్లీ లోకేష్‌ను విచారిస్తారు. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో లోకేష్ పిటిషన్ దాఖలు చేశారు.

కానీ లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. 41ఏ నోటీసులు జారీ చేసి లోకేష్‌ను విచారించాలని, విచారణకు లోకేష్ సహకరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇటీవల ఢిల్లీకి చేరుకున్న ముగ్గురు సీఐడీ అధికారుల బృందం.. ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో ఉన్న లోకేష్‌ను కలుసుకుని నోటీసులు ఇచ్చింది. దీంతో తనకు లవ్ లెటర్ ఇచ్చి వెళ్లారని, తప్పకుండా విచారణను ఎదుర్కొంటానని లోకేష్ వ్యంగ్యస్త్రాలు సంధించారు. 

Tags:    

Similar News