నారా బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ కన్ఫామ్.. తెలుగు యువత నేతలతో కీలక భేటీ
మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో నారా భువనేశ్వరి,
దిశ, వెబ్‌డెస్క్: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో నారా భువనేశ్వరి, నారా బ్రహ్మణి పొలిటికల్ అరగ్రేటం చేయనున్నారని తెలుస్తోంది. ఇటీవల టీడీపీ నిరసన కార్యక్రమాల్లో వారిద్దరూ పాల్గొనడం, పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తుండటంతో.. రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే విషయం స్పష్టమవుతోంది. టీడీపీ నేతలు, శ్రేణులు కూడా అదే కోరుకుంటున్నారు. భువనేశ్వరి, బ్రాహ్మణి యాక్టివ్ అయితే టీడీపీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే భువనేశ్వరి బస్సు యాత్రకు సిద్దమవుతోండగా.. నారా బ్రాహ్మణి యువగళం పాదయాత్ర కంటిన్యూ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.
ఇటీవల బ్రాహ్మణితో జనసేన నేతలు భేటీ అవ్వగా.... టీడీపీ నేతలు, కార్యకర్తలు తరచుగా ఆమెను కలుస్తూ వస్తున్నారు. శనివారం తెలుగు యువత నాయకులు నారా బ్రాహ్మణితో భేటీ అయ్యారు. రాజమండ్రిలో ఉన్న బ్రాహ్మణిని కాకినాడ జిల్లా రౌతులపైడి మండలానికి చెందిన తెలుగు యువత నాయకులు కలిశారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. టీడీపీ నేతలతో బ్రాహ్మణి వరుస భేటీలను చూస్తుంటే ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్లే కనబడతుందని రాజకీయ వర్గాలు అభిప్రాయడుతున్నాయి.
గతంలో కుప్పం, హిందూపురం, మంగళగిరిలో టీడీపీ తరపున నారా బ్రాహ్మణి ప్రచారం చేశారు. కానీ ఆమె ఫుల్ టైమ్ పాలిటిక్స్‌లోకి మాత్రం అడుగుపెట్టలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ పరిణామాల క్రమంలో బ్రాహ్మణి రాజకీయాల్లో తప్పనిసరి పరిస్దితుల్లో అడుగుపెట్టాల్సి వస్తుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే బ్రాహ్మణి రాజకీయ అంశాలతో పాటు సభల్లో ఎలా మాట్లాడాలనే దానిపై శిక్షణ కూడా పొందుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే జగన్ ప్రభుత్వం టార్గెట్‌గా నారా బ్రాహ్మణి చేస్తున్న ట్వీట్లు కలకలం రేపుతోన్నాయి. వీటి ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టాననే సంకేతాన్ని నారా బ్రాహ్మణి పరోక్షంగా క్యాడర్‌కు పంపిస్తున్నట్లు చెప్పవచ్చు. త్వరలోనే ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారని తెలుగు తమ్ముళ్లల్లో చర్చ జరుగుతోంది.
Read More : ఏపీలో భువనేశ్వరి బస్సు యాత్రకు ముహూర్తం ఫిక్స్.. టీడీపీలో జోష్ పెంచేలా ప్లాన్