అమ్మా.. ప్రసాద్‌రెడ్డి..! లక్ష్మీపార్వతి ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసరా?
ఆంధ్ర విశ్వ విద్యాలయాన్ని (ఏయూ) వైసీపీ కార్యాలయంగా మాజీ వైస్ చాన్సలర్ పీవీజీడీ ప్రసాదరెడ్డి మార్చేశారంటూ అదే పనిగా ఆరోపణలు చేయడమే తప్ప వాటిని వెలికి తీసే ప్రయత్నమే కూటమి ప్రభుత్వం ఇంకా ప్రారంభించలేదు.
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వ విద్యాలయాన్ని (ఏయూ) వైసీపీ కార్యాలయంగా మాజీ వైస్ చాన్సలర్ పీవీజీడీ ప్రసాదరెడ్డి మార్చేశారంటూ అదే పనిగా ఆరోపణలు చేయడమే తప్ప వాటిని వెలికి తీసే ప్రయత్నమే కూటమి ప్రభుత్వం ఇంకా ప్రారంభించలేదు. వీసీ ప్రసాదరెడ్డి, రిజిస్ర్టార్ స్టీఫెన్ లు చేసిన అడ్డగోలు వ్యవహారాలు మారిన ప్రభుత్వం ద్వారా, విచారణ ద్వారా కాదు విచిత్రంగా విద్యార్థుల ద్వారా ఒక్కక్కొటిగా వెలుగులోకి వస్తున్నాయి. వీసీ, రిజిస్ట్రార్‌లు రాజీనామా చేసిన తరువాత తీరిగ్గా క్యాంపస్‌లోకి వెళ్లి ప్రగల్బాలు పలికి వచ్చిన కూటమి ప్రజాప్రతినిధులు ఆ దిశగా ఇప్పటికీ చేసిందేమీ లేకపోవడం, ఇన్చార్జి రిజిస్ట్రార్ గా నియమితులైన వ్యక్తి ప్రసాదరెడ్డి చెప్పినట్టే చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపణలు చేయడం హాస్యాస్పదం.
ప్రొఫెసర్ లక్ష్మీపార్వతి..
వైసీపీ నాయకురాలు, రాష్ర్ట అధికార భాషా సంఘం అధ్యక్షురాలు లక్ష్మీపార్వతిని వీసీ ప్రసాదరెడ్డి ఏకంగా ఏయూ తెలుగు ప్రొఫెసర్‌గా ఎవ్వరికీ తెలియకుండా నియమించేశారు. ఏయూలో నూతనంగా ఏర్పాటు చేసిన టీడీఆర్ (ట్రాన్స్ డిసిప్లినరీ రిసెర్చ్) హబ్ కోట్ల రూపాయల అవినీతికి, వందలాది నకిలీ పీహెచ్డీ లకు వేదిక అని ఆరోపణలు వచ్చినా కూటమి ప్రభుత్వం దానిపై దృష్టి సారించలేదు. ఆ హబ్ ద్వారా లక్ష్మీ పార్వతికి తెలుగు ప్రొఫెసర్ హోదా ఇచ్చి పీహెచ్ఎ పరిశోధకులకు మార్గదర్శకురాలి (గైడ్)గా నియమించారు. ఎవ్వరికీ తెలియకుండా మూడేళ్ల క్రితమే ఈ నియామకం జరిగిపోయింది. వివిధ సంస్థల్లో విధులు (ఉద్యోగాలు) నిర్వహిస్తున్న వారికి పీహెచ్‌డీ చేసే అవకాశం కల్పించేందుకు ఈ టీడీఆర్ హబ్‌ను ఏర్పాటు చేశారు. యూనివర్సిటీతో ఎలాంటి సంబంధం లేని జేమ్స్ స్టీఫెన్ అనే వ్యక్తిని తీసుకొచ్చి ఈ టీడీఆర్ హబ్‌కు డీన్ చేశారు. ఆయనే ఆ తరువాత రిజిస్ట్రార్ అయ్యారు. కాగా, లక్ష్మీపార్వతి విజయవాడలో ఉంటారు. పీహెచ్‌డీ చేసే పరిశోధ కులంతా విశాఖపట్నానికి చెందినవారు. అక్కడ ఉండే ఆమె ఇక్కడి వారిని ఎలా గైడ్ చేస్తారనే విషయం, వారు ఎలా నేర్చుకొన్కారన్న విషయం ఏడుకొండలవాడికేఎరుక.
వైసీపీ నేత కావడమే అర్హత..
పీహెచ్‌డీ చేసే పరిశోధకులకు గైడ్ వ్యవహరించే ప్రొఫెసర్ నిబంధనలమేరకు పీజీ విద్యార్థులకు పాఠాలు బోధించి ఉండాలి. కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. కనీసం ఒక్కరికైనా పీహెచ్‌డీ అందించే ప్రక్రియలో సహకరించి ఉండాలి. ఇవేమీ లేకుండానే లక్ష్మీపార్వతిని గైడ్ గా నియమించేశారు. అంతేకాదు, ఆమెకు 'గైడ్ షిప్' చేశారంటూ కొంత మొత్తం కూడా మంజూరు చేసేశారు. అయితే, ఆమె విశాఖపట్నం ఎప్పుడు వస్తారు?, మేము ఎప్పుడు ఆమె సలహాలు తీసుకుంటామంటూ పరిశోధనా విద్యార్థులు వాపోతు న్నారు. దీంతో "మీకు అలాంటి భయం అవసరం లేదు. అంతా మేం చూసుకుంటాం" అని డీన్ కమ్ రిజిస్ర్టార్ జేమ్స్ స్టీఫెన్ భరోసా ఇవ్వడం విశేషం.
అవసరమైన పీహెచ్‌డీలు ..
సాధారణంగా ఇలాంటి రీసెర్చి చేసేవారు సంబంధిత విభాగంతో అనుసంధానమై ఉండాలి. పరీక్షల నిర్వహణ కూడా ఆయా విభాగాల ఆధ్వర్యంలోనే నిర్వహించాలి. కానీ, టీడీఆర్ హబ్ డీన్‌గా వ్యవహరిస్తున్న జేమ్స్ స్టీఫెన్ ఈ నిబంధనలు ఏవీ పాటించడం లేదు. లక్ష్మీపార్వతిలాగే ప్రైవేటు కాలేజీల్లో పని చేస్తున్న వారిని తీసుకువచ్చి ప్రొఫెసర్లుగా నియమించి.. 'గైడ్లు' అని ప్రచారం చేసి వారికి పరిశోధకులను అప్పగించారు. అలా రీసెర్చి చేస్తున్న వారికి అక్కడే పరీక్షలు నిర్వహించి, వారే వాటిని దిద్ది మార్కులు వేస్తున్నారు. ఈ విషయం తెలిసి ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ డీవీఆర్ మూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పరీక్షలను తాము గుర్తించడం లేదన్నారు. ఒక్క తెలుగులోనే కాదు ప్రసాద రెడ్డి జమానాలో ఈ హబ్ కేంద్రంగా జరిగిన అక్రమాలు, అన్యాయలు, అవినీతికి అంతేలేదు.
ఇప్పటికైనా విచారణ చేస్తారా?
ఇప్పుడు వారికి పరీక్షలు నిర్వహించాల్సిన సమయం వచ్చింది. దీనికి వైస్ చాన్సలర్ ప్రొసీడింగ్స్ ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం వీసీగా ఎవరూ లేకపోవడంతో సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీఆర్ రాజు పరీక్షల నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే, టీడీఆర్ హబ్‌లో పరీక్షలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వక పోవడం గమనార్హం. టీడీఆర్ హబ్‌లో అడ్డగోలు వ్యవహారాలపై హిందీ విభాగాధిపతి సత్యనారాయణ ఏడాది క్రితమే విచారణకు డిమాండ్ చేశారు. గత 20 రోజులుగా శిబిరం ఏర్పాటు చేసి దీక్షలు చేస్తున్న ఉద్యమకారులు అసలు హబ్ పై పూర్తి స్థాయి విచారణ జరిపే వరకూ ఇందులోని విద్యార్థులకు పరీక్షలే పెట్లవద్దని డిమాండు చేస్తున్నారు. పాలక పెద్దలు ఏం చేస్తారో చూడాలి.