ఐరాస సమావేశాల్లో ఎంపీ తంగెళ్ల.. ఏపీ నుంచి హాజరైన మొదటి ఎంపీగా రికార్డు
న్యూయార్క్‌లో జరుగుతున్న 79వ ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ (38) పాల్గొన్నారు.
దిశ, కాకినాడ: న్యూయార్క్‌లో జరుగుతున్న 79వ ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ (38) పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు వివిధ దేశాలకు చెందిన యువ ఎంపీలను సమితి ప్రతినిధులు ఆహ్వానిస్తారు. ఈ ఏడాది సమావేశాలకు ఇండియా నుంచి 9 మంది ఎంపీలను ఆహ్వానించగా.. అందులో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్‌కు అవకాశం దక్కింది. ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి ఎంపికైన మొట్టమొదటి ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కావడం గమనార్హం.
గత ఎన్నికల్లో కాకినాడ నుంచి భారీ మెజారిటీతో ఎన్నికైన ఉదయ్ శ్రీనివాస్.. దక్షిణ భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలలో పిన్న వయస్కుడు. ప్రతిష్టాత్మక ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొనే అవకాశం దక్కించుకున్న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్‌ను కూటమి నాయకులు, కార్యకర్తలు అభినందించారు. ఈ సందర్భంగా ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొనడం గర్వంగా ఉందని, సమావేశాల్లో పాల్గొంటున్న మేధావుల సూచనలు, సలహాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. రాజకీయంగా అన్ని విధాల ప్రోత్సహించి ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు ఉదయ్ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.