కాంగ్రెస్‌లో షర్మిల చేరిక.. కొడాలి నాని సంచలన డిమాండ్
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 1 శాతం ఓట్లు కూడా లేవని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాల నాని అన్నారు. ...
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 1 శాతం ఓట్లు కూడా లేవని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాల నాని అన్నారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఏపీని అడ్డగోలుగా విభజించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయిందని విమర్శించారు. ఏపీ హక్కులను పట్టించుకోకుండా గాలికి వదిలేసిన పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో చనిపోయిన కాంగ్రెస్‌ను బతికించింది రాజశేఖర్ రెడ్డి అని కొడాలి తెలిపారు.
‘వైఎస్ చనిపోయిన తర్వాత ఆయననే ముద్దాయిగా చేసింది కాంగ్రెస్ పార్టీ. వైఎస్ కుటుంబాన్ని పట్టించుకోలేదు. వైఎస్ జగన్‌ను 16 నెలలు జైల్లో పట్టి నానా ఇబ్బందులకు గురి చేసింది. ఈ రెండు కారణాలతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో దిక్కుమాలిన పరిస్థితిలోకి పోయింది. రాజశేఖర్ రెడ్డిని దోషిగా చూపించిన కాంగ్రెస్ రాష్ట్రంలో ఉనికి కాపాడుకోవాలంటే సీఎం జగన్‌కు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. రాజకీయ ప్రయోజనాలకోసం రాజశేఖర్ రెడ్డిని దోషిని చేశాం. జగన్‌ను జైల్లో పెట్టాం. దిక్కుమాలిన పరిస్థితిలోకి వచ్చామని కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పుకోవాలి. ఏపీకి అన్యాయం చేశామని ప్రజలకు క్షమాపణలు చెబితే ఏపీలో ఆ పార్టీకి కొన్ని ఓట్లు అయినా పడతాయి. లేదంటే కాంగ్రెస్‌లో ఎవరు చేరినా ఒరిగేదేమీ లేదు.’ అని కొడాలి నాని వ్యాఖ్యానించారు.