Pamarru: బోటులో వెళ్లి బాధితులను ఒడ్డుకు చేర్చిన మంత్రి
వరద బాధితులను మంత్రి సవిత బోటులో వెళ్లి ఒడ్డుకు చేర్చారు..
దిశ, ఏపీ బ్యూరో: చంద్రబాబు ప్రభుత్వం అండగా ఉంటుందని, వరద ఉధృతి పెరిగే ప్రమాదముందని తక్షణమే ఇళ్లు ఖాళీ చేయాలని మంత్రి ఎస్.సవిత కోరారు. పెనమలూరు, పామర్రు ప్రాంతాల్లోని వరద ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. రామలింగేశ్వర్ నగర్, తాడిగడప మునిసిపాలిటీలో వడ్డేరు కాలనీ, హెచ్పీ గ్యాస్ గోడౌన్ కాలనీ, మాదు తిరుపతిరావునగర్ తదితర ప్రాంతాల్లో నడుంలోతు నీటిలో పర్యటించారు. వరద బాధితులకు బిస్కెట్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిందని, భోజన, వసతి సౌకర్యాలు కల్పించిందని, వరదలు తగ్గే వరకు అక్కడ ఉండాలని, వరద బాధితులను మంత్రి సవిత కోరారు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌తో కలిసి పెనమలూరులోని వరద ప్రాంతాల్లో భారీ పడవపై పర్యటించి, వరద బాధితులను పెద్ద సంఖ్యలో ఒడ్డుకు చేర్చారు. అనంతరం పామర్రులోని వల్లూరుపాలెం, తొట్లవల్లూరు జెడ్పీ హైస్కూళ్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఎమ్మెల్యే వర్ల కుమార రాజాతో కలిసి మంత్రి సందర్శించారు.