AP:‘పోలవరం గురించి మాట్లాడే అర్హత వారికి లేదు’.. మంత్రి నిమ్మల కీలక వ్యాఖ్యలు
మాజీ సీఎం జగన్ విధ్వంసం ముఠాకు పోలవరం గురించి, సీఎం చంద్రబాబు గురించి గాని మాట్లాడుతుంటే రావణాసురుడు రాముడు గురించి రాక్షసులు యజ్ఞయాగాదుల గురించి మాట్లాడుతున్నట్లు ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎద్దేవ చేశారు.

దిశ,పాలకొల్లు: మాజీ సీఎం జగన్ విధ్వంసం ముఠాకు పోలవరం గురించి, సీఎం చంద్రబాబు గురించి గాని మాట్లాడుతుంటే రావణాసురుడు రాముడు గురించి రాక్షసులు యజ్ఞయాగాదుల గురించి మాట్లాడుతున్నట్లు ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎద్దేవ చేశారు. పాలకొల్లులో శుక్రవారం మంత్రి నిమ్మల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీకి సీఎం చంద్రబాబు గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని అన్నారు. డయాఫ్రం వాల్ గురించి తెలియని వ్యక్తికి, పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదని చెప్పిన వ్యక్తి పోలవరం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 2020 జూన్ లో పూర్తవుతుందని ఒకసారి 2021 డిసెంబర్‌లో పూర్తవుతుందని ఒకసారి గతంలో మీ సీఎం కదా చెప్పింది అన్నారు.
గత ప్రభుత్వం వల్ల పోలవరానికి రూ.50 వేల కోట్లు నష్టం వాటిల్లిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు పోలవరాన్ని పట్టాలెక్కించారని తెలిపారు. కేంద్రంలో ప్రధాని, ఆర్థిక మంత్రిని, జలవనరుల శాఖ మంత్రి సీఎం చంద్రబాబు కలిసి రూ.12 వేల 157 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించారని, ఇప్పుడు అడ్వాన్స్‌గా 5052 కోట్ల రూపాయల నిధులు పోలవరం కోసం వచ్చాయని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల 440 కోట్లు రూపాయలు డయా ఫ్రమ్ వాల్ కు నష్టం వాటిల్లిందని తెలిపారు. వందల కోట్ల రూపాయలు గైడ్ బండకు కూడా నష్టపరిచిందని తెలిపారు. వైసీపీ గాలికి వదిలేస్తే కూటమి వచ్చిన తర్వాత 829 కోట్లు రూపాయలు నిర్వాసితులకు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందని తెలిపారు.