AP News:రబీ కొనుగోళ్ల పై మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే డబ్బులు అకౌంట్‌లో వేయడం జరుగుతుందని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) పేర్కొన్నారు.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే డబ్బులు అకౌంట్‌లో వేయడం జరుగుతుందని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) పేర్కొన్నారు. పౌర సరఫరాల సంస్థ లిమిటెడ్ 227వ బోర్డు సమావేశం విజయవాడ కానూరు సివిల్ సప్లై భవనంలో ఈ రోజు(శుక్రవారం) జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ.. వచ్చే ఖరీఫ్ నాటికి ధాన్యం కొనుగోలు మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి RSKలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో 5,61,216 మంది రైతుల నుంచి 35,48,724 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఈ క్రమంలో రూ.8,138 కోట్ల నగదు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని తెలిపారు. ఇక వచ్చే నెల(ఏప్రిల్) నుంచి రబీ కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
ఈ నెలఖారు వరకే గడువు..
ప్రతి పేద కుటుంబానికి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేయడానికి దీపం-2 పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకంలో తొలి ఉచిత సిలిండర్ పొందేందుకు ఈ నెలాఖరు (మార్చి 31, 2025) వరకే గడువు ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటి వరకు దీపం-2 పథకం ద్వారా 98 లక్షల మంది లబ్ధిదారులు మొదటి ఉచిత సిలిండర్‌ను పొందారని ఆయన వివరించారు.
సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందచేయబడతాయి. నాలుగు నెలలకు ఒకసారి బుక్ చేసుకోవచ్చు. పట్టణ ప్రాంతాల్లో 24 గంటల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల్లో గ్యాస్ డెలివరీ అందించబడుతుంది. డెలివరీ అయిన 48 గంటల్లోపు చెల్లించిన మొత్తం లబ్ధిదారుల ఖాతాలో తిరిగి జమ అవుతుంది. ఈ పథకానికి సంబంధించిన ఏవైనా సమస్యలు, సమాచారం లోపం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1967 కి కాల్ చేసి ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చని వివరించారు.
ప్రైవేటు గోడౌన్‌ల వద్ద AI కెమెరాలు
రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ, రవాణా, భద్రత మరియు నిర్వహణను సమర్థవంతంగా చేయడమే లక్ష్యంగా ప్రైవేటు గోడౌన్ వద్ద AI కెమెరాల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గోడౌన్‌లో ఉన్న సరుకు నిల్వ, భద్రతను టెక్నాలజీ ద్వారా పర్యవేక్షించేందుకు ప్రతి గోడౌన్ వద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అదేవిధంగా ప్రతి గోడౌన్ పైభాగంలో సోలార్ ప్యానెల్‌లు ఏర్పాటు చేయడం ద్వారా గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సాహం జరుగుతుందన్నారు.
తృణ ధాన్యాల వినియోగం పై అవగాహన
విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం లో భాగంగా హాస్టల్ లకు రూ.లక్షా 14 వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. తృణ ధాన్యాల వినియోగం పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. త్వరలో చౌక ధరల దుకాణాల నుంచి రాగి, కొర్రలు, సజ్జలు అందించే విధంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. దీనిపై విధివిధానాలు త్వరలో ప్రకటిస్తామన్నారు.అదేవిధంగా తృణ ధాన్యాల ఉత్పత్తి పెంచేందుకు, రైతులకు అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.