హత్యకేసులో నందిగం సురేష్ కు షాక్.. రిమాండ్ పొడిగింపు

వెలగపూడి మహిళ హత్యకేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ కు కోర్టు రిమాండ్ పొడిగించింది. 14 రోజులు రిమాండ్ విధించడంతో తిరిగి గుంటూరు జైలుకు తరలించారు పోలీసులు.

Update: 2024-10-21 07:51 GMT

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్సీపీ (YSRCP) మాజీ ఎంపీ నందిగం సురేష్ కు షాక్ తగిలింది. మహిళ హత్యకేసులో ఆయనకు రిమాండ్ ముగియగా.. పోలీసులు మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణకు మరింత సమయం కావాలని పోలీసులు కోరడంతో.. నందిగం సురేష్ కు కోర్టు మరో 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. నవంబర్ 4వ తేదీ వరకూ నందిగం సురేష్ ను పోలీసులు విచారించనున్నారు. కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన్ను తిరిగి గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఇప్పటికే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ నిందితుడిగా ఉన్నారు.

2020లో వెలగపూడిలో రెండువర్గాల మధ్య జరిగిన గొడవలో మరియమ్మ అనే మహిళ మరణించింది. ఆ గొడవ అప్పటి బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ప్రోద్బలంతోనే జరిగిందని మహిళ బంధువులు ఆరోపించారు. మహిళ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నందిగం సురేష్ పేరును కూడా కేసులో చేర్చారు. కానీ.. అధికారపార్టీ ఎంపీ కావడంతో కేసు విచారణ ముందుకు కదల్లేదు. ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమకు న్యాయం చేయాలని తుళ్లూరు పోలీసుల్ని ఆశ్రయించగా.. అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. అప్పటికే టీడీపీ కార్యాలయంపై దాడికేసులో అరెస్టై.. హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ పొందారు. కానీ.. మంగళగిరి కోర్టులో తుళ్లూరు పోలీసులు పీటీవారెంట్ కు దరఖాస్తు చేయగా.. దానికి న్యాయస్థానం అనుమతించింది.

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సెప్టెంబర్ 5న అరెస్ట్ అవ్వగా.. మధ్యంతర బెయిల్ వచ్చినా విడుదల కాకుండానే పీటీ వారెంట్ తో తుళ్లూరు పోలీసులు అక్టోబర్ 7న మహిళ హత్యకేసులో అరెస్ట్ చేశారు. అక్టోబర్ 21 వరకూ తొలుత రిమాండ్ విధించగా.. తాజాగా ఆ రిమాండ్ ను పొడిగించింది. 


Similar News