విశాఖ ఉక్కును వదిలేసి.. మిట్టల్ ప్లాంట్‌కు రాయితీలా?

విశాఖ ఉక్కును బలపరిచే విషయం విస్మరించి అనకాపల్లిలో ఆర్సిలర్ మిట్టల్ అనే ప్రైవేటు కంపెనీకి వేలాది ఎకరాల భూమిని ధారాదత్తం చేసి ఇంకో ఉక్కు కర్మాగారాన్ని పెట్టే దశలో పోవడం బాధాకరమని ఫోరం ఫర్ బెటర్ విశాఖ కన్వీనర్ ఈఏఎస్ శర్మ విమర్శించారు.

Update: 2024-11-16 02:12 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ ఉక్కును బలపరిచే విషయం విస్మరించి అనకాపల్లిలో ఆర్సిలర్ మిట్టల్ అనే ప్రైవేటు కంపెనీకి వేలాది ఎకరాల భూమిని ధారాదత్తం చేసి ఇంకో ఉక్కు కర్మాగారాన్ని పెట్టే దశలో పోవడం బాధాకరమని ఫోరం ఫర్ బెటర్ విశాఖ కన్వీనర్ ఈఏఎస్ శర్మ విమర్శించారు. గత ప్రభుత్వం కూడా విశాఖ ఉక్కు మీద సవతి ప్రేమ చూపిస్తూ.. ఇంకొక ప్రైవేట్ కంపెనీ‌కి కడపలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని ధారాదత్తం చేయడం ఉత్తరాంధ్ర ప్రజలకు బాధ కలిగించిందని ఆయన ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.

విశాఖ ఉక్కుకు సొంత ఇనుప గనులు కేటాయించి ఉంటే, ఇప్పటికే కర్మాగారం లాభాలు గడించేదని స్పష్టం చేశారు. కేంద్రం ప్రైవేటు కంపెనీల మీద చూపిస్తున్న వ్యామోహం, ప్రభుత్వ సంస్థల మీద చూపించడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా, రాష్ట్ర ప్రభుత్వ నేతలు కళ్ళు తెరిచి, ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను గౌరవించి, ఒక ప్రైవేట్ ఉక్కు కంపెనీకి ప్రజల భూములను అప్పగించే బదులు, విశాఖ ఉక్కును పునరుద్ధరించే దిశలో, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ ఉక్కు విషయంలో ద్వంద్వ వైఖరిని చూపించడాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు హర్షించరని శర్మ స్పష్టం చేశారు.


Similar News