రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తీగల వంతెన..లండన్ బ్రిడ్జి తరహాలో

ఏపీ-తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని సిద్దేశ్వరం-సోమశిల వద్ద కృష్ణా నదిపై వంతెన నిర్మాణానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది.

Update: 2024-08-27 02:32 GMT

దిశ ప్రతినిధి, కర్నూలు:ఏపీ-తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని సిద్దేశ్వరం-సోమశిల వద్ద కృష్ణా నదిపై వంతెన నిర్మాణానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఏపీ-తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ సిద్దేశ్వరం-సోమశిల ప్రాంతాల మధ్యనున్న కృష్ణానదిపై భారత్ మాల పరియోజన పథకంలో భాగంగా రూ.1200 కోట్ల వ్యయంతో తీగెల వంతెన నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్రంలోని కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల బైపాస్ రోడ్డు వరకు 174 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి (ఎన్ హెచ్-167కె) నిర్మాణాలకు పెద్దపీట వేసింది. అందుకు తగ్గ డిజైన్లను కూడా రూపొందించింది. ఇప్పటికే తెలంగాణలో కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ వరకు హైవే పనులు కొనసాగుతున్నాయి. సంగమేశ్వరం నుంచి ఆత్మకూరు, అక్కడి నుంచి నంద్యాల వరకు పనులు చేపట్టాల్సి ఉంది. వీటి నిర్మాణాలకు గాను కేంద్రం నిధులు విడుదల చేసింది. కానీ ఇంకా పనులు ప్రారంభించలేదు.

పర్యాటక ఆకర్షణగా..

ఇక్కడ సాధారణ వంతెన కాకుండా పర్యాటక ఆకర్షణగా ఐకానిక్ వంతెన నిర్మించాలని నిర్ణయించారు. సిద్దేశ్వరం-సోమశిల మధ్య దాదాపు 2 కిలోమీటర్ల మేర ఈ వంతెన నిర్మించనున్నారు. కేబుల్ ఆధారిత సస్పెన్షన్ వంతెనగా నిర్మించేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ను ఆమోదించారు. నల్లమల ప్రాంతంలో శ్రీశైలం రిజర్వాయర్ వెనుక జలాల్లో విహరించే సందర్శకులకు ఈ వంతెన పెద్ద ఆకర్షణగా నిలవనుంది. దీనిపై ప్రత్యేకంగా అద్దాల నడక దారిని ఏర్పాటు చేయనున్నారు. ఆలయ శిఖరం రూపంలో పైలాన్, ఎల్‌ఈడీ లైట్ల వెలుగులతో నిర్మించేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఈ వంతెనను రెండున్నరేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఈ వంతెన నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి.

తీగల వంతెనకే కేంద్ర మంత్రి మొగ్గు..

సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి నేటి వరకు నేతలు తీగెల వంతెన స్థానంలో బ్రిడ్జీ కమ్ బ్యారేజీ నిర్మించాలని కొందరు, అలుగు నిర్మించాలని మరి కొందరు నిరసనలు చేస్తూ వచ్చారు. కానీ ఎట్టకేలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీగెల వంతెనకే మొగ్గు చూపుతూ ప్రకటన చేశారు. ఈ వంతెన ప్రపంచంలో రెండవదిగా, దేశంలో మొదటిదిగా చరిత్రలో నిలిచిపోనుంది. వచ్చే నెలలో ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు రెండ్రోజుల క్రితం కలిసిన నేపథ్యంలో ఈ ప్రకటన చేసినట్లు తెలంగాణ మంత్రి వెల్లడించారు. ఈ ఐకానిక్ వంతెన నిర్మాణంతో రెండు తెలుగు రాష్ట్రాలు పర్యాటక శోభను సంతరించుకోనున్నాయి.

ఆనాడే తెరపైకి సిద్దేశ్వరం అలుగు..

సిద్దేశ్వరం-సోమశిల ప్రాంతాల మధ్య కృష్ణానదిపై కేంద్ర ప్రభుత్వం తీగెల వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అంతకుముందు 1890లో ఏపీ-తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన సిద్ధేశ్వరం వద్ద అలుగు నిర్మిస్తే నీరు నిల్వ ఉండి రాయలసీమ జిల్లాలకు నీరందే అవకాశం ఉందని, లేకుంటే సీమ ఎడారిగానే మారనుందని గ్రహించిన ఆంగ్లేయుల కాలంలో అప్పటి రాయలసీమ గవర్నర్, జన వనరుల అభివృద్ధి ఇంజనీర్ సర్ మెకంజి దత్తత మండలమైన కర్నూలు సరిహద్దు కృష్ణానదిపై సర్వే చేశారు. సప్తనది సంగమేశ్వరం వద్ద సిద్దేశ్వరం ప్రాంతంలో రెండు కొండల మధ్య అరకిలోమీటరు పొడవునా అలుగుతో కూడిన వంతెన నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించి నట్లు చరిత్ర చెబుతోంది. అయితే ప్రపంచ యుద్ధాల కారణంగా ఆ నిర్మాణం ఆగిపోయింది.

73 ఏళ్ల కిందటే ఆమోదం..

1951లో అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మాణానికి కేంద్ర ప్లానింగ్ కమిషన్ ఆమోదం తెలిపింది. అప్పటి సీఎం రాజగోపాలాచారి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం పదవి కోసం రాయలసీమలోని అనంతపురం జిల్లాకు చెందిన ఓ నాయకుడు ఈ సిద్దేశ్వరం బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మాణానికి ఒప్పుకోలేదు. దీంతో ఆ ప్రణాళిక నాగార్జున సాగర్ రూపంలో నందికొండ మధ్య నిర్మితమై అటు హైదరాబాద్ నిజాం రాష్ట్రం, ఇటు రాయలసీమ ప్రాంతాల మధ్య అభివృద్ధి నిరోధానికి ఆనాడే విష బీజాలు ఈ ప్రాంత నాయకులు నాటారనే విమర్శలున్నాయి. 2007లో పుట్టి ప్రమాదం తర్వాత 17 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత కేంద్రం రూ.1200 కోట్ల వ్యయంతో తీగల వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కానీ గత ఏడాది మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి తీగల వంతెనకు బదులు బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మించాలని, తద్వారా 60-70 టీఎంసీల నీటిని నిల్వ చేసుకుని రాయలసీమ జిల్లాలకు సాగు, తాగునీటి ఇబ్బందులుండవని కోరుతూ నిరసన గళం వినిపించారు.

అలుగు నిర్మిస్తే ప్రయోజనాలివీ..

ఇటీవల కాలంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మదనపల్లె పర్యటనలో భాగంగా తిరుపతి విమానాశ్రయంలో కాసేపు ఆగిన సమయంలో తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి ద్వారా రాయలసీమ మేధావుల ఫోరం కేంద్ర మంత్రికి సిద్దేశ్వరం అలుగు ప్రాధాన్యత గురించి వివరించారు. అలుగు నిర్మిస్తే 60-70 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉందని, తద్వారా పోతిరెడ్డిపాడు ద్వారా సీమ ప్రాజెక్టులకు సాగు, తాగునీరు అందుతుందని విన్నవించారు. అలుగు నిర్మాణంపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని సంబంధిత అధికారులను కేంద్ర మంత్రి ఆదేశించారు. కానీ కేంద్రం ప్రకటించినట్టుగానే తీగెల వంతెన నిర్మాణానికే మొగ్గు చూపడం పట్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే కేంద్ర మంత్రి ప్రకటన నేపథ్యంలో తీగెల వంతెనను సీమ నేతలు మరోమారు అడ్డుకునే ప్రయత్నం చేసే అవకాశాలు లేకపోలేదు.

లండన్ బ్రిడ్జి తరహాలో వంతెన..

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నిర్మించనున్న కొత్త వంతెన లండన్ సస్పెన్షన్ బ్రిడ్జి తరహాలో నిర్మించనున్నారు. ఇప్పటికే ఏపీ-తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ సిద్దేశ్వరం-సోమశిల ప్రాంతాల మధ్యనున్న కృష్ణానదిపై భారత్ మాల ప్రాజెక్టు లో భాగంగా రూ.1200 కోట్ల వ్యయంతో తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. వీటికి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. రెండు కొండల మధ్య పిల్లర్లు కాకుండా లండన్‌ బ్రిడ్జీ మాదిరిగా అటు ఇటు రెండు పెద్ద టవర్లు నిర్మించాలని నిర్ణయించారు. ఈ రెండు టవర్లకు కేబుల్స్‌ బిగించి బ్రిడ్జీ ఏర్పాటు చేయడం వల్ల కేబుల్స్‌ నుంచి బ్రిడ్జీ సప్‌సెంట్‌ అవుతుంది. ఈ బ్రిడ్జి ఏర్పాటు చేయడానికి జాతీయ రహదారుల సంస్థ నిర్ణయించింది.

వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో సోమశిల బ్రిడ్జీ నిర్మాణం కోసం కొల్లాపూర్‌ ఎక్స్‌ రోడ్డులో శిలాఫలకం వేశారు. అప్పట్లో బీఓటీ పద్ధతిన నిర్మించేందుకు రూ.93 కోట్లు కేటాయించారు. కానీ పనులు మొదలు కాలేదు. తిరిగి 2012లో బ్రిడ్జి నిర్మాణానికి రూ.193 కోట్లు, రోడ్డుకు రూ.60 కోట్లు కేటాయించగా రోడ్డు పనులు పూర్తి చేశారు. ఐకానిక్‌ బ్రిడ్జీ ఏర్పాటు చేయడం వల్ల పర్యాటకంగా ఈ ప్రాంతంలో రిసార్ట్స్‌ ఏర్పాటవుతాయని అంచనా వేస్తున్నారు. నల్లమల అందాలు తిలకించేందుకు ఇప్పటికే పర్యాటకులు వస్తుండటంతో ఈ బ్రిడ్జి నిర్మాణం ద్వారా మరింత ఆకర్షణీయ ప్రాంతంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ బ్రిడ్జీతో ఆధ్యాత్మిక ప్రాంతమైన సప్త నదుల సంగమ క్షేత్రమైన సంగమేశ్వరం, సోమనాదేశ్వర స్వామి, ఉమ్మడి ఏపీలో బాసర తర్వాత బాసర గా పేరుగాంచిన సరస్వతి అమ్మవారైన శ్రీ కొలనుభారతి క్షేత్రం వంటి ఆలయాలు మరింత ప్రాధాన్యతను సంతరించుకోనున్నాయి.


Similar News