Krishna Delta:సాగునీరు అందక ఎండుతున్న పంటలు ..ఆందోళనలో రైతులు
కృష్ణా డెల్టా శివారు భూములకు సాగునీరు అందించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రాజుపేటలో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
దిశ,పెదపాడు:కృష్ణా డెల్టా శివారు భూములకు సాగునీరు అందించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రాజుపేటలో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతు సంఘం నాయకులు రాజుపేటలో సాగునీరు అందని వరి నారుమళ్ళను, సాగు భూములను పరిశీలించారు. సాగునీరు అందక నారుమళ్ళు బీటలు వారుతున్నాయని, నాట్లు ఆలస్యం అవుతుందని అన్నదాతలు వాపోయారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, మండల కార్యదర్శి గుండపనేని సురేష్ మాట్లాడారు. కృష్ణా డెల్టాకు శివారు ప్రాంతం కావడంతో సాగునీరు అందక రైతాంగం ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నదుల్లో సమృద్ధిగా నీరు ఉన్నా పంటల సాగుకు మాత్రం సాగునీరు అందడం లేదని చెప్పారు. కృష్ణా మెయిన్ కెనాల్ కు తగినంత నీరు వదిలి శివారు ప్రాంత భూములకు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. పంట కాలువలో పేరుకుపోయిన గుర్రపు డెక్క, తూడు, చెత్త చెదారం తొలగించే చర్యలు కూడా చేపట్టాలన్నారు. పెదపాడు మండలంలోని రాజుపేట, వసంతవాడ,గోగుంట,తోట గూడెం, నాయుడు గూడెం తదితర గ్రామాల ఆయకట్టు భూములకు సాగునీటి కొరత లేకుండా చూడాలని, భూములు దమ్ము చేసుకుని నాట్లు వేసుకునేలా తగినంత నీరు అందేలా కృష్ణా ఏలూరు కాలువకు వదలాలని కోరారు. సాగునీరు ఇచ్చి అన్నదాతలను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు.