మహానంది క్షేత్రంలో చిరుత కలకలం..భయం గుప్పిట్లో భక్తులు, స్థానికులు
మహానంది పుణ్యక్షేత్రంలో చిరుత సంచారం స్థానికులతో పాటు భక్తులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
దిశ ప్రతినిధి,కర్నూలు:మహానంది పుణ్యక్షేత్రంలో చిరుత సంచారం స్థానికులతో పాటు భక్తులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఐదు రోజుల కిందట శిరివెళ్ల మండలంలోని పచ్చర్ల గ్రామంలో ఓ మహిళ మొండాన్ని ఎత్తుకెళ్లిన ఘటనతో అక్కడి అటవీ సమీప గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. అటవీ ప్రాంతంలోకి వెళ్లాలంటేనే జంకుతున్నారు. అలాంటిది ఏకంగా మహానంది పుణ్యక్షేత్రంలో గత నాలుగైదు రోజులుగా చిరుత సంచరిస్తోంది. వీటి సంచారాన్ని అరికట్టాల్సిన అటవీ శాఖ అధికారులు నిద్రావస్థను వీడడం లేదు. చిరుతను బంధించి వాటి సంచారాన్ని నివారించాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు.
భయాందోళనలో భక్తులు
నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రం చిరుత పులుల సంచారానికి వేదికైంది. నాలుగైదు రోజులుగా చిరుత సంచరిస్తుండడం అక్కడి స్థానికులతో పాటు ఆలయానికి వచ్చే భక్తులను భయాందోళనకు గురి చేస్తోంది. రెండు రోజులు వరుసగా ఆలయ పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరించింది. వీటి సంచారాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన అటవీ శాఖ నిద్రావస్థను వీడడం లేదు. అటవీ శాఖ నిర్లక్ష్యం భక్తుల ప్రాణాల మీదకు వచ్చింది. కొంత నిర్లక్ష్యం వీడిన అటవీ అధికారులు అక్కడక్కడ సిబ్బందిని ఏర్పాటు చేశారు. కానీ చిరుత ఆదివారం తెల్లవారుజామున రూటు మార్చి ఆలయ పరిసర ప్రాంతంలో సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న గోశాల సమీపంలో చిరుత సంచరించడంతో సమీప గ్రామాల ప్రజలు, భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ఒకవేళ పగటి వేళ చిరుత సంచరిస్తే పరిస్థితి ఏంటని, పచ్చర్లలో జరిగిన ఘటన మాదిరి కాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ చిరుతను పట్టుకునేందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి 9 గంటలు దాటిన తర్వాత ఎవరూ బయటకు రావొద్దని, తెల్లవారుజామున కూడా ఒంటరిగా తిరగొద్దని అటవీ అధికారులు హెచ్చరిస్తున్నారు.