CM Chandrababu:సచివాలయంలో వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

పారిశ్రామికాభివృద్ధికి సంబంధించి దేశంలో టాప్-5 రాష్ట్రాలతో పోటీ పడే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన పారిశ్రామికాభివృద్ధి విధానం ఉండాలని, ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు.

Update: 2024-08-12 14:48 GMT

దిశ ప్రతినిధి,కర్నూలు:పారిశ్రామికాభివృద్ధికి సంబంధించి దేశంలో టాప్-5 రాష్ట్రాలతో పోటీ పడే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన పారిశ్రామికాభివృద్ధి విధానం ఉండాలని, ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. నూతన పారిశ్రామిక విధానం రూపకల్పనలో నీతి ఆయోగ్ ఆలోచనలను కూడా పరిగణలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 15 శాతానికి పైగా వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా నూతన పాలసీ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. త్వరలో అమల్లోకి రానున్న నూతన పారిశ్రామికాభివృద్ధి విధానం 2024-29 పై రూపొందించిన ముసాయిదా విధానాన్ని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ.భరత్, అధికారులు సోమవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వివరించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పరిశ్రమలకు సంబంధించి గతంలో ఎపికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ను తిరిగి తీసుకు వచ్చేందుకు కృషి చేయాలని ఆదేశించారు. 2014-19 కాలంలో ఎపిలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం కల్పించే వివిధ రాయితీలు, మౌలిక సదుపాయాల కల్పన, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి అంశాల్లో దేశంలో మొదటి స్థానంలో ఉండేవారిమని మళ్ళీ అలాంటి పరిస్థితులు కల్పించి పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం పై ఒక నమ్మకం కలిగే రీతిలో నూతన పారిశ్రామిక విధానం రూపకల్పన చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రస్తుతం 53 శాతం రా మెటీరియల్ కింద రాష్ట్రం నుంచి వెళుతున్నాయని వాటికి ఏ విధంగా వాల్యూ ఎడిషన్ ఇవ్వాలో చూడాలని అన్నారు. పిపిపి, పి-4 విధానాలను నూతన విధానంలో పొందుపర్చాలని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు వేగవంతంగా ఇవ్వగలిగితే పరిశ్రమలు త్వరగా ఏర్పాటు అవుతాయని సీఎం అన్నారు.

దేశంలో ఏ రాష్ట్రానికి లేని రీతిలో 10 ఓడరేవులు,10 విమానాశ్రయాలు, మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యాలు, లాజిస్టిక్ సౌకర్యాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని కావున పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి ఇవి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అంతేగాక దేశ పశ్చిమ తీరం కంటే తూర్పుతీర ప్రాంతం రోడ్డు, రైలు, విమానయాన మార్గాలతో మెరుగైన రీతిలో అనుసంధానించబడి ఉందని, నదుల అనుసంధానం కూడా పరిశ్రమలు ఏర్పాటు చేయ గోరే వారికి అన్ని విధాలా అనుకూలమైన అంశాలను పేర్కొన్నారు. వేగవంతంగా, కాస్ట్ ఎఫెక్టివ్ నెస్ ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

భారతదేశానికి కొత్తగా ఏ పరిశ్రమ వచ్చినా దాన్ని ఏపికి తీసుకువచ్చే విధంగా మనందరం పనిచేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. గతంలో కర్నాటకకు వెళ్ళి పోయిన హీరో మోటార్స్, తెలంగాణాకు వెళ్లిపోయిన అపోలో టైర్స్ వంటి సంస్థలను ఎపికి తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఆక్వా, ఆహారశుద్ధి వంటి రంగాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపన జరిగేలా నూతన పారిశ్రామికాభివృద్ధి విధానం రూపకల్పన జరగాలని చెప్పారు.

ఈనెల 16న పారిశ్రామక వేత్తలతో సమావేశం కానున్నామని, అదే విధంగా ఈనెల 23న మళ్లీ నూతన పారిశ్రామికాభివృద్ధి విధానం పై మరోసారి సమావేశమై చర్చిద్దామని సీఎం చంద్రబాబు అధికారులకు చెప్పారు. అంతకు ముందు రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ కార్యదర్శి డా.ఎన్.యువరాజ్ ప్రతిపాదిత 2024-29 ఏపీ పారిశ్రామికాభివృద్ధి పారిశ్రామిక విధానం ముసాయిదాలో పొందుపర్చిన అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎంకు వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ.భరత్, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి డా.ఎన్.యువరాజ్, సీఎం అదనపు కార్యదర్శి కార్తికేయ మిశ్రా, పరిశ్రమల శాఖ కమిషనర్ సిహెచ్.శ్రీధర్, ఏపీఐఐసీ ఎండి అభిషిక్త్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.


Similar News