Gannavaram ఎయిర్‌పోర్టుకు అలర్ట్... త్వరలో నిబంధనలు

ప్రపంచాన్ని కరోనా మరోసారి వణికిస్తోంది. ఇప్పటికే చైనాతోపాటు పలు దేశాల్లో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. దీంతో భారతదేశ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది....

Update: 2022-12-22 09:48 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచాన్ని కరోనా మరోసారి వణికిస్తోంది. ఇప్పటికే చైనాతోపాటు పలు దేశాల్లో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. దీంతో భారతదేశ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా అంతర్జాతీయ విమానాశ్రయాలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. విదేశీ ప్రయాణికుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇందులో భాగంగా విజయవాడలోని ఎయిర్‌పోర్టుకు సైతం కేంద్రం కరోనా నిబంధనలు పాటించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. త్వరలోనే కొవిడ్ నిబంధనలు పాటించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో విమానాశ్రయం సిబ్బంది అప్రమత్తమైంది. ఎయిర్‌పోర్ట్‌ ఆవరణలోకి ప్రయాణికులను మాత్రమే అనుమతించే అంశంపై ఆలోచిస్తున్నారు.

మరోవైపు విదేశీ, స్వదేశీ ప్రయాణికులకు వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం పూర్తి ఆదేశాలు జారీ చేస్తే వీటన్నింటిని అమలు చేసేందుకు గన్నవరం విమానాశ్రయం సిబ్బంది సన్నద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు క్రమేపి పెరుగుతున్నాయి. దీంతో కరోనా ఫోర్త్ వేవ్ ప్రమాదం పొంచి ఉందన్న ప్రమాదం ఆసన్నమైందని సంకేతాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఫోర్త్ వేవ్ రాకుండా ఇప్పటి నుంచే తగు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే కొవిడ్‌ను నియంత్రించవచ్చని వైద్య, ఆరోగ్య నిపుణులు పలు సూచనలు చేస్తు్న్నారు. మరోవైపు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సైతం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కొవిడ్ పట్ల అలర్ట్‌గా ఉండాలని లేఖలు సైతం రాసిన సంగతి తెలిసిందే.


Similar News