AP:పొంగిన వాగులు..వరద ముప్పులో జగన్నాధపురం
తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం జగన్నాధపురం గురువారం ఉదయం వరద గుప్పిట్లో చిక్కుకుంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు గ్రామ సమీపంలో వున్న దుమ్ములగొండి వాగుకు ఆకస్మికంగా వరద నీరు వచ్చి చేరింది.
దిశ,ఏలూరు: తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం జగన్నాధపురం గురువారం ఉదయం వరద గుప్పిట్లో చిక్కుకుంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు గ్రామ సమీపంలో వున్న దుమ్ములగొండి వాగుకు ఆకస్మికంగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో పక్కనే పల్లపు ప్రాంతాల్లో ఉన్న జగన్నాథ పురం గ్రామం పైన వాగు వరద వచ్చి పడింది. వాగు ఉధృతితో గ్రామం మొత్తం మునిగిపోయింది. గ్రామంలో నడుం లోతు నీరు ప్రవహించింది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామ సర్పంచ్ చల్లారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాగుకు గండి కొట్టడంతో గ్రామంలో వరద తగ్గుముఖం పట్టింది. ఈ విషయమై సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ దుమ్ములకొండి వాగు గ్రామం పై పడుతున్న విషయంలో పరిష్కార మార్గం సూచిస్తూ గతం నుండి పలు సమావేశాల్లో తీర్మానం చేశామన్నారు. అప్పటి ఎమ్మెల్యే దృష్టికి కూడా చాలా సార్లు తీసుకు వెళ్లిన పట్టించుకోలేదన్నారు. వాగుకు బ్రిడ్జి నిర్మాణం చేయాలని, ఊరిమీద వాగు వరద రాకుండా పరిష్కారం చూపాలని తాము కోరుతున్నామని సర్పంచ్ చెప్పారు.