తిరుమలలో జడ్చర్ల ఎమ్మెల్యే హాట్ కామెంట్స్.. కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీకి హెచ్చరిక

తిరుమలలో తమవాళ్లను అనుమతించనట్లే.. ఏపీ వాళ్లను ఎమ్మెల్యేలంతా కలిసి రాష్ట్రానికి రానివ్వొద్దని తీర్మానం చేస్తే.. ఆ బాధ ఏంటో మీక్కూడా తెలుస్తుందని ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-21 08:16 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో వీఐపీ దర్శనాలే కాదు.. వీఐపీ సిఫార్సు లేఖల దర్శనాలుంటాయన్న విషయం తెలిసిందే. ఒక్క తిరుమలలోనే కాదు.. దేశంలోని ప్రసిద్ధ ఆలయాలలో ప్రజాప్రతినిధులకు వీఐపీ దర్శనాలుంటాయి. ప్రొటోకాల్ ప్రకారం దానిని పాటిస్తారు. తాజాగా తిరుమల వెళ్లిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుపతి దేవస్థానానికి సిఫార్సు లేఖలతో వచ్చినవారిని దర్శనానికి అనుమతించకపోవడం బాధాకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం తెలంగాణ, ఏపీ తనకు రెండు కళ్లలాంటివని చెప్పారని, ఇక్కడ మాత్రం తెలంగాణ నుంచి సిఫార్సు లేఖలపై వచ్చిన వారిని అనుమతించడం లేదని వాపోయారు. అంటే సీఎం చంద్రబాబు ఇప్పుడొక కన్నును తీసేసుకున్నారా ? అని ప్రశ్నించారు.

తెలంగాణలో యాదగిరిగుట్ట, భద్రాచలం దేవస్థానాలకు వచ్చే భక్తులకు ఆంధ్రా నాయకులు ఇచ్చే సిఫార్సు లేఖలను తాము అనుమతించి దర్శనాలు కల్పిస్తున్నామని గుర్తు చేశారు. కానీ తమ సొంత మనుషులు, పార్టీ కార్యకర్తలు తిరుమలకు వస్తే కనీసం రూమ్ లు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఏపీలో అధికారంలో ఒక ప్రభుత్వం ఉంటే.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీవారు హైదరాబాద్ లో ఆశ్రయం పొందుతారని, అయినా తాము ఏనాడు ఒక్కమాట కూడా అనలేదన్నారు. ఏపీ వాళ్లు హైదరాబాద్ లో బిజినెస్ చేసుకున్నా ఏమీ అనలేదన్నారు.

తిరుమలలో తమవాళ్లను అనుమతించనట్లే.. ఏపీ వాళ్లను ఎమ్మెల్యేలంతా కలిసి రాష్ట్రానికి రానివ్వొద్దని తీర్మానం చేస్తే.. ఆ బాధ ఏంటో మీక్కూడా తెలుస్తుందని ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. తిరుమల దర్శనాలకు తెలంగాణ నేతలు ఇచ్చే సిఫార్సు లేఖల్ని అసెంబ్లీ సమావేశాల్లో అనుమతించకపోతే.. అసెంబ్లీ సమావేశాల్లో తాము కఠిన నిర్ణయాలు తీసుకుంటామని, తర్వాత మీరే బాధపడతారని హెచ్చరించారు. వ్యాపారం కోసమే హైదరాబాద్ కు రావొద్దన్నారు. నిజమైన అన్నదమ్ముల్లా మెలగుదామని, ఏపీ ప్రభుత్వం ఈ విషయంపై ఆలోచించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. 


Similar News