AP Politics: ఆపరేషన్ వైజాగ్.. రూ.50 వేల కోట్ల అక్రమాలు

విశాఖ కేంద్రంలో వేల కొట్ల అక్రమాలు, భూ కబ్జాలు, టీడీఆర్ కుంభకోణాలు, అసైన్డ్ భూముల కుంభకోణాలు చేసిన వైసీపీ నేతలు, వారికి సహకరించి భాగస్వాములైన అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

Update: 2024-06-10 04:28 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ కేంద్రంలో వేల కొట్ల అక్రమాలు, భూ కబ్జాలు, టీడీఆర్ కుంభకోణాలు, అసైన్డ్ భూముల కుంభకోణాలు చేసిన వైసీపీ నేతలు, వారికి సహకరించి భాగస్వాములైన అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఆంధ్రా విశ్వవిద్యాయలం నుంచి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ వరకూ వైసీపీ నేతలు, వారి అనుచరులు వేటినీ వదల్లేదు.

చివరకు వైజాగ్ ఫిలిం నగర్ క్లబ్‌ను కూడా హస్తగతం చేసుకొని రచ్చ రచ్చ చేశారు. ఇప్పుడు అదే పనిగా ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో ఆపరేషన్ విశాఖను కొత్త ప్రభుత్వం ప్రారంభించింది.

ప్రాజెక్టులపై దృష్టి..

వైసీపీ నేతల చెరలో ఉన్న విలువైన ప్రాజెక్టులపై, అవి వారి చేతికి వచ్చిన విధానంపై కొత్త ప్రభుత్వం వివరాలు సేకరిస్తోంది. వైసీపీలో నెంబర్ 2 గా చెలామణి అయిన విజయసాయి రెడ్డి చేజిక్కించుకున్న విశాఖ నగరం నడిబొడ్డున ఉన్న దసపల్లా భూములు, విజయసాయి రెడ్డి ఎల్‌ఎల్‌పీ కంపెనీలను ఏర్పాటు చేసి నిర్మాణాలు ప్రారంభించిన లూలూ మాల్ ప్రత్యామ్నాయ భూములు, కొందరు మంత్రులు చేతుల్లోకి వెళ్లిన మధురవాడలోని 70 ఎకరాల ఎన్‌సీ‌సీ భూములపై వివరాల సేకరణ ప్రారంభమైంది.

నిబంధనలకు విరుద్ధంగా వికలాంగులు, వృద్ధులకు ఆవాసాలు నిర్మించాల్సిన ఓల్డేజ్ హోం నిర్మిస్తామని చెప్పి హాయగ్రీవ సంస్ధ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో కేటాయింపజేసుకున్న సాగర్ నగర్ లోని విలువైన 12 ఎకరాల హయిగ్రీవ భూముల్లో కలెక్టర్ మల్లిఖార్జున సహకారంతో విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. క్రైస్తవులకు చెందిన సిరిపురం సీబీసీఎన్‌‌సీ భూములు కూడా నిబంధనలకు విరుద్ధంగా అధికారుల సహకారంతో ఎంవీవీ సత్యానారాయణ చేతికే వచ్చాయి.

లాక్కొన్న భూములు, ఆస్తులు

వీటితో పాటు వుడా ఎప్పుడో కేటాయించిన రేడియంట్ భూములు, ప్రభుత్వం భూ కేటాయింపులు జరిపిన బే పార్క్ హోటల్, రాడిసన్ బ్లూ హోటల్ వంటి వాటిల్లో వాటాలు వైసీపీ అనుకూల పారిశ్రామికవేత్తల చేతుల్లోకి వెళ్లాయి. భయపెట్టి, బ్లాక్ మెయిల్ చేసి వీటిని లాక్కొన్నారనే ఆరోపణలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా, చట్టాలను ఉల్లంఘించి

రామానాయుడు స్టూడియోలో పదెకరాలను లాక్కొని లే అవుట్‌కు అనుమతులు పొందారు. సినిమా షూటింగ్‌ల కోసం ప్రభుత్వం చౌకగా కేటాయించిన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారమేమిటని అధికారులు ప్రశ్నించకుండా అనుమతులిచ్చేశారు.

అసైన్డ్ జీఓ రద్దు చేద్దామా?

రాష్ర్టంలో దళితుల పొట్టకొట్టి లక్షల కోట్ల విలువైన లక్షల ఎకరాల అసైన్డ్ భూములను భూస్వాములు, వైసీపీ నేతలు, అధికారుల పరం చేసిన 596 జీఓను రద్దు చేయడంపైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దళితులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. విశాఖ కేంద్రంగా మాజీ ప్రధాన కార్యదర్శి కే ఎస్ జవహర్ రెడ్డి బృందం వందల ఎకరలా అసైన్ఢ్ భూముల స్కాంకు పాల్పడింది. దీంతో ఆయనను ఆ పదవి నుంచి తప్పించి సెలవులో కూడా పంపించారు.

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కబ్జా

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బంగారు బాతుగుడ్డు లాంటి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌ను విజయసాయి రెడ్డి కబ్జా చేశారు. ఆయన పెద్దల్లుడైన శరత్ చంద్రారెడ్డి అధ్యక్షుడుగా, ముఖ్య అనుచరుడు ఎస్‌ఆర్ వ్యాపార సంస్ధల అధినేత గోపీనాధ్ రెడ్డి కార్యదర్శిగా వందల కోట్ల నిధులను దుర్వినియోగం చేశారు. వైఎస్ జగన్ ప్రాపకం కోసం నిబంధనలకు విరుద్దంగా కడప స్టేడియం పేరిట 40 కోట్ల రూపాయలకు పైగా అసోసియేషన్ నిధులను దుర్వినియోగం చేయడం వివాదాస్పదమైంది. అసోసియేషన్ ఎఫ్‌డీలను ఇస్టానుసారం వాడేయడంపైన అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

ఫిలింక్లబ్ లాక్కొన్నారు..

ప్రభుత్వాలతో సంబంధం లేకుండా హైదరాబాద్ ఫిలిం నగర్ క్లబ్‌కు అనుబంధంగా విశాఖలో నడుస్తున్న విశాఖ ఫిలిం నగర్ క్లబ్‌ను వైసీపీ పెద్దలు తమ ఆధీనంలోకి తెచ్చకొన్నారు. గత ప్రభుత్వం రామానాయుడు స్టూడియో క్రింద కేటాయించిన ఐదు ఎకరాలను పదికి పెంచుతామని క్లబ్ పాలక వర్గంలో దూరిన వైసీపీ నేతలు చివరకు ఆ ఐదు ఎకరాల కేటాయింపును రద్దు చేసి కమీషన్‌ల కోసం సభ్యుల డబ్బుతో ప్రైవేటు భూములను కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు.

విజయసాయిరెడ్డి స్కెచ్‌లో భాగంగా మెరైన్ బోర్డు చైర్మన్‌గా చేసిన కాయల వెంకట రెడ్డి క్లబ్ అధ్యక్ష స్థానంలోకి రాగా, అనుచరుడైన ఎస్‌ఆర్ షాపింగ్ మాల్ గోపినాధ్ రెడ్డి క్లబ్ కోశాధికారి అయ్యారు.


Similar News