యుద్ధమే కావాలంటే యుద్ధమే చేస్తాం : వైసీపీకి పవన్ వార్నింగ్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు పెట్టి రిమాండ్‌కు పంపించారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు.
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు పెట్టి రిమాండ్‌కు పంపించారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఇది చాలా బాధకరమని చెప్పుకొచ్చారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ములాఖత్‌లో భాగంగా బుధవారం కలిశారు. అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు సానుభూతి ప్రకటించడానికే తాను ఇక్కడికి వచ్చినట్టు వెల్లడించారు. గతంలో చంద్రబాబుకు, తనకు పాలసీల విషయంలో భిన్నమైన ఆలోచన ఉన్నాయని స్పష్టం చేశారు. చంద్రబాబుతో విభేదాలు ఉండొచ్చని, అభిప్రాయ భేదాలు ఉండొచ్చని, పాలసీపరంగా విభేదాలు ఉన్నప్పటికీ.. ఆయన పాలన సామర్థ్యాలపై తనకు ఎటువంటి అపనమ్మకం లేదని అన్నారు. ఆరోజున ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ తీసుకోవడంపై తాను విబేధించానని చెప్పారు. ఇది పాలసీపరమైన విబేధాలతో గొడవపడి బయటకు వచ్చానే తప్ప.. వ్యక్తిగతంగా చంద్రాబు ఇంటిగ్రిటీని తాను ఎప్పుడూ ప్రశ్నించలేదని చెప్పారు. వ్యక్తిగతంగా ఏనాడూ విభేదించలేదు. రూ.317 కోట్ల స్కామ్ పేరు చెప్పి సీఎంకు ఆ అవినీతి మరక అంటగడుతున్నారు. గుజరాత్‌లో ప్రారంభమైన కంపెనీ కాంట్రాక్టు ఇచ్చారు. అది హార్డ్‌వేర్‌ను సప్లయ్ చేస్తుంది. ఏదైనా తప్పు జరిగితే ఆ సంబంధిత వ్యక్తులను విచారించాలి. అలాంటిది సైబరాబాద్ వంటి సిటీని నిర్మించిన వ్యక్తిని ఇలాంటి కేసులో ఇరికించడం బాధాకరం. ఈడీ విచారించాల్సిన ఇలాంటి కేసులను రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుంది. ఇలా చేయడం రాష్ట్రానికి మంచిది కాదు’ అని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.
జగన్ ఏమైనా మహానుభావుడా?
చంద్రబాబు నాయుడుపై అభియోగాలు మోపిన జగన్ ఏమైనా మహానుభావుడా? అని పవన్ కల్యాణ్ ప్రకటించారు.ఇతనేమన్నా వాజ్‌పేయీనా? లాల్ బహదూర్ శాస్త్రినా? ఈడీ కేసులను ఎదుర్కొంటున్నాడు. దేశం విడిచి వెళ్లాలంటే కోర్టుల అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి. అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వ్యక్తి. అందరినీ భయభ్రాంతులకు గురి చేసే వ్యక్తి. డేటా చౌర్యం జరుగుతోందని ఒకప్పుడు రాజకీయం చేసిన వ్యక్తి నేడు వలంటీర్ వ్యవస్థను అడ్డంపెట్టుకుని డేటా చౌర్యంకు పాల్పడుతున్నాడు’ అని పవన్ కల్యాణ్ ఆరోపించారు. చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన జగన్ ఇటువంటి అవినీతి ఆరోపణలు చేయడం హ్యాస్యాస్పదంగా ఉంది అని పవన్ ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో అడ్డగోలు హామీలిచ్చి వేటినీ అమలు చేయలేదు కానీ అడ్డగోలు దోపిడీ మాత్రం చేస్తున్నారు. మద్యం విషయంలోనే కోట్లు జేబుల్లోకి వేసుకుంటున్నాడు. రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి ప్రశ్నించడానికే వీలులేకుండా పోయింది. ఎవరైనా ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారు. నాలాంటి వ్యక్తులనే ఏపీ సరిహద్దుల్లో ఆపేస్తున్నారు. జగన్ బురదలో కురుకుపోయి.. ఆ బురదను ఇతరుల మీద వేస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు. అధికారులు వైఎస్ జగన్‌ను నమ్ముకోవడం సరికాదు. జగన్‌ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లే. వైసీపీకి ఆరు నెలల సమయం ఉంది. ఈలోగా మారండి. మారితే మంచిది లేకపోతే ఆ తర్వాత వదిలిపెట్టను. యుద్ధమే కావాలంటే యుద్ధమే చేసి చూపిస్తాం. వ్యతిరేక ఓటు చీలనివ్వనని 2021లోనే చెప్పాను...దానికి కట్టుబడి ఉన్నాను అని పవన్ కల్యాణ్ ప్రకటించారు.