ఏపీ పోలీస్ శాఖపై హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు

ఏపీలో పోలీస్ శాఖపై హోంమంత్రి వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు....

Update: 2024-06-14 14:35 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పోలీస్ శాఖపై హోంమంత్రి వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హోమంత్రిగా ఆమె ఖరారు అయ్యారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ కింది స్థాయి నుంచి పోలీసు శాఖను ప్రక్షాళ చేస్తామని చెప్పారు. లేని దిశ చట్టాన్ని గత ప్రభుత్వంలో చూపించారని మండిపడ్డారు. తప్పు చేసిన వారిని కచ్చితంగా గాడిలో పెడతామన్నారు.గతంలో తనపై పోలీసులు అట్రాసిటీ కేసు పెట్టారని, పోలీసు అధికారులపై ఎలాంటి కక్ష సాధింపులుండవని స్పష్టం చేశారు. మహిళల భద్రత విషయంలో వెనక్కి తగ్గేది లేదని, మహిళా సంఘాల సూచనలు తీసుకుంటామని తెలిపారు. మహిళలపై అఘాయిత్యాలు చేయాలనే ఆలోచన రాకుండా భయపడేలా తమ చర్యలు ఉంటాయన్నారు. గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామని హోమంత్రి వనిత హెచ్చరించారు.

పోలీసులు చట్ట ప్రకారం పని చేయాలని  హోంమంత్రి అనిత సూచించారు. కానీ చాలా మంది ఉన్నతాధికారులు జగన్‌కు, వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఇప్పటికీ ఆ ఆలోచనలోనే ఉంటే ఒప్పుకోమని హెచ్చరించారు. గత ఐదేళ్లలో చాలా మంది ఐపీఎస్‌లు వాళ్ల స్థాయిని తగ్గించుకున్నారని చెప్పారు. ఐపీఎస్ లు, పోలీస్ అధికారుల గౌరవాన్ని పెంచుతామన్నారు. అన్యాయాలపై ఉక్కుపాదం మోపాలని చెప్పారు. జగన్ హయాంలో పోలీసులు తమను చాలా ఇబ్బందులు పెట్టారని, మహిళలపై జరిగిన దాడులకు సంబంధించి డీజీపీకి వినతిపత్రం కూడా ఇవ్వనివ్వలేదని మండిపడ్డారు. త్వరలో ప్రోటోకాల్ లో వస్తానని, ఆ రోజే పోలీసులను హెచ్చరించానని వంగలపూడి వనిత తెలిపారు. ఇకపై ఏ అడపిల్లకు అన్యాయం జరగడానికి వీల్లేదని చెప్పారు. పోలీసులకు అందించాల్సిన బకాయిలపై త్వరలో సమీక్ష నిర్వహిస్తామని వంగలపూడి అనిత స్పష్టం చేశారు.

కాగా రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పాయకరావుపేట ఎమ్మెల్యేగా వంగలపూడి వనిత గెలుపొందారు. దీంతో ఆమెను చంద్రబాబు కేబినెట్‌లోకి తీసుకున్నారు. మంత్రి పదవిని కేటాయించడంతో  ఆమె ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా హోంమంత్రి పదవిని వనితకు ఖరారు చేశారు. దీంతో  ఆమె స్పందించారు. పోలీస్ శాఖలో ప్రక్షాళన చేస్తామని పేర్కొన్నారు. 

Similar News