ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్, మాజీ ఏఏజీ పొన్నవోలుకు హైకోర్టు నోటీసులు

ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌తో పాటు మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది..

Update: 2024-07-31 13:30 GMT

 దిశ, వెబ్ డెస్క్:  ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌తో పాటు మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. స్కిల్ కేసు దర్యాప్తులో ఉండగా ఇద్దరు ప్రెస్ మీట్ నిర్వహించడంపై పిల్ దాఖలైంది. ప్రెస్‌మీట్ పెట్టి ప్రజా ధనం దుర్వినియోగం చేశారని పిటిషనర్ ఆరోపించారు. ఈ పిల్‌ను పరిశీలించిన ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

కాగా స్కిల్ డెవలప్ మెంట్ స్కీంలో భారీ స్కాం జరిగిందంటూ గత సెప్టెంబర్‌లో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. ఈ కేసుకు సంబంధించి అప్పటి సీఐడీ చీఫ్ సంజయ్‌, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించారు. వీరి వాదనలతో ఏకీభవించిన కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించింది. దీంతో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడిపారు. అయితే చంద్రబాబు బెయిల్ విషయంలోనూ వాడీవేడీగా ఇరువర్గాల వాదనలు సాగాయి. బెయిల్ ఇవ్వొద్దంటూ సీఐడీ వాదించింది. పొన్నవోలు సైతం అవే వాదనలు వినిపించారు. చివరకు చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావడంతో ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు. అయితే ఈ కేసు నేపథ్యంలో అప్పటి సీఐడీ చీఫ్ సంజయ్, మాజీ ఏఏజీ పొన్నవోలు.. హైదరాబాద్‌తోపాటు పలుచోట్ల మీడియా సమావేశాలు నిర్వహించారు. కోర్టులో వాదనలు సాగుతుండగానే కేసు వివరాలను బయటకు చెప్పారు. ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తూ ప్రెస్‌మీట్లు నిర్వహించడం ప్రజా ధనం దుర్వినియోగం చేయడమేనని అప్పట్లో పలువురి నుంచి వ్యతిరేకత వినిపించింది.  కోర్టులో పిటిషన్లు, పిల్‌లు దాఖలయ్యాయి. 

ప్రస్తుతం రాష్ట్రంలో అధికారం మారడంతో సంజయ్, పొన్నవోలు పెట్టిన ప్రెస్‌మీట్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలు అయింది. పిల్‌ను పరిశీలించిన ధర్మాసనం విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా  వేసింది.  అయితే గత సెప్టెంబర్ 9నే చంద్రబాబును అరెస్ట్ చేశారు. మళ్లీ ఈ ఏడాది సెప్టెంబర్ 9నే హైకోర్టు కేసు విచారణ చేపట్టడం చర్చనీయాంశమైంది. 

Tags:    

Similar News