ఉత్కంఠ:రాయచోటీ టీడీపీలో హీట్..టిక్కెట్‌కు రసవత్తర పోరు

ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి మంచి పట్టు కలిగిన రాయచోటిలో ఈసారి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసేందుకు కసరత్తు చేస్తోంది. అన్నమయ్య జిల్లా కేంద్రంగా మారడంతో పట్టు బిగించాలని ముమ్ముర ప్రయత్నాలు

Update: 2023-08-08 02:44 GMT

దిశ ప్రతినిధి, కడప : ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి మంచి పట్టు కలిగిన రాయచోటిలో ఈసారి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసేందుకు కసరత్తు చేస్తోంది. అన్నమయ్య జిల్లా కేంద్రంగా మారడంతో పట్టు బిగించాలని ముమ్ముర ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలో టీడీపీ టిక్కెట్‌ ఆశిస్తున్న వారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది. ముస్లిం మైనార్టీల ప్రభావం ఉన్న రాయచోటిలో 2009 నుంచి కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుస విజయాలు సాధించింది. అప్పటినుంచి తెలుగుదేశం పార్టీ పరపతి కోల్పోతూ వస్తోంది. వరుస పరాజయాలు చవిచూసినా, ఈసారి ఎలాగైనా అక్కడ పార్టీ జెండా ఎగరవేసేందుకు వ్యూహాలు రచిస్తోంది.

టిక్కెట్ కోసం పోటాపోటి

అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి అసెంబ్లీ నుంచి పోటీ చేసే ఛాన్స్ ఎవరికి దక్కతుందోనన్న చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు నలుగురు ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల తనయులు ఉన్నారు. లక్కిరెడ్డిపల్లి రాయచోటిలో విలీనం కాకముందు నుంచి ఆ నాలుగు కుటుంబాల రాజకీయ ప్రభావం నియోజకవర్గంపై ఉంది. ఆ కుటుంబాల నుంచే ప్రస్తుతం టీడీపీ టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో అందరినీ ఒక తాటిపైకి తీసుకువచ్చి టికెట్ ఖరారు చేయడం అధిష్టానానికి తలభారంగానే మారింది.

* మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డి తీవ్రంగా టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆయన ప్రస్తుతం రాయచోటి తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జిగా ఉన్నారు. టిక్కెట్ తనదేనన్న ధీమాతో ఏదో ఒక కార్యక్రమాలతో ప్రజల్లో తిరుగుతున్నారు. కాగా, ఇదే కుటుంబం నుంచి కడప పార్లమెంట్ టికెట్ ఆయన సోదరుడు శ్రీనివాస్ రెడ్డికి చంద్రబాబు ఖరారు చేశారు. ఈయన సతీమణి మాధవికి కూడా కడప అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబానికి ఎన్ని టిక్కెట్ ఇస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. అన్నమయ్య జిల్లాలో ఆ కుటుంబానికి ప్రాధాన్యమిస్తే రమేష్ రెడ్డికి అవకాశం ఉంటుందని పలువురు భావిస్తున్నారు.

* మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి కూడా ఇక్కడి నుంచి టిక్కెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. కొద్ది నెలల క్రితం దివంగత నందమూరి తారకరత్న ద్వారా టికెట్ కోసం ప్రయత్నాలు చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తూనే ఉండడంతో ఆయన పేరు కూడా బాగా వినిపిస్తోంది .

* ఎంపీ, ఎమ్మెల్యేగా పలుసార్లు ప్రాతినిధ్యం వహించిన సుగువాసి పాలకొండరాయుడు తనయుడు ప్రసాద్ బాబు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రాయచోటి సీటు అడుగుతున్నారు. ఆయన ఇప్పటికే లోకేష్ బాబును, ఇటీవల పులివెందులలో పార్టీ అధినేత చంద్రబాబును కలసి టిక్కెట్ తనకే కేటాయించాలని కోరినట్లు సమాచారం. రాజంపేట అసెంబ్లీ టికెట్ చంద్రబాబు చెంగల్ రాయుడికి కాకుండా ఇతరులకు కేటాయిస్తే సామాజిక అంచనాలు ప్రసాద్ బాబుకు కలిసివచ్చే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. గతంలో ఈయన టీటీడీ బోర్డు మాజీ సభ్యుడిగా పనిచేశారు.

* మాజీ ఎమ్మెల్యే, దివంగత మండిపల్లి నాగిరెడ్డి తనయుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి టిక్కెట్ తనకే అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానంలోని నాయకులను పలుమార్లు కలుస్తున్నట్లు సమాచారం. పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్ దృష్టికి కూడా టిక్కెట్ తనకు కేటాయించాలని తీసికెళ్ళారని సమాచారం. టికెట్ కోసం గట్టి ప్రయత్నాల్లోనే ఉన్నారు.

తీవ్ర పోటీ నేపథ్యంలో..

టీక్కెట్ ఆశిస్తున్న వారందరూ ఎన్నికల్లో అవసరమైన మేరకు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధిష్టానానికి సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. రాయచోటి టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొనడంతో, ఎవరికి దక్కుతుందనే ఆసక్తికర పరిణామం నెలకొంది. టిక్కెట్ దక్కని వారు పార్టీ కోసం ఏ మేరకు పనిచేస్తారోనని ఉత్కంఠతగా పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నారు.


Similar News