AP:ఈ నెల 13న గుంటూరులో ఇండియా పోస్ట్ రన్.. ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి

జాతీయ తపాలా వారోత్సవాలను పురస్కరించుకుని ఏపీ సర్కిల్ తపాలా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 13న గుంటూరులో ఇండియా పోస్ట్ రన్ 2024 ను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని విజయవాడ పోస్ట్ మాస్టర్ -జనరల్ డీఎస్ వీఆర్ మూర్తి పేర్కొన్నారు.

Update: 2024-10-08 12:51 GMT

దిశ ప్రతినిధి,గుంటూరు: జాతీయ తపాలా వారోత్సవాలను పురస్కరించుకుని ఏపీ సర్కిల్ తపాలా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 13న గుంటూరులో ఇండియా పోస్ట్ రన్ 2024 ను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని విజయవాడ పోస్ట్ మాస్టర్ -జనరల్ డీఎస్ వీఆర్ మూర్తి పేర్కొన్నారు. ఫిట్ ఇండియా - ఫిట్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో పౌరులందరిలోనూ ఆరోగ్య పరమైన జీవన విధానం అలవర్చాలన్న లక్ష్యంతో ఇండియా పోస్ట్ రన్ కార్యక్రమాన్ని జరుపుతున్నామని ఆయన వివరించారు. మంగళవారం ఉదయం ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో రన్‌కు సంబంధించిన టీ-షర్ట్, పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. గుంటూరు లాడ్జ్ సెంటర్‌లో ఉన్న ఆంధ్ర లూథరన్ కళాశాల ఆవరణలో రన్ ప్రారంభమవుతుందని, కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారని పేర్కొన్నారు. రన్ నిర్వహణలో సహకారం అందిస్తున్న ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ యాజమాన్యానికి పోస్ట్ మాస్టర్ జనరల్ మూర్తి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ జనరల్ కే.సుధీర్ బాబు రన్ వివరాలను వెల్లడించారు. తపాలా శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రన్ కార్యక్రమాన్ని మూడు కేటగిరీల్లో నిర్వహిస్తున్నాం అన్నారు. పాల్గొనే వారి వయస్సు, దూరాన్ని బట్టి 10కే, 5కే, మరియు 3 కే రన్లను నిర్వహిస్తున్నామన్నారు. ఆహ్లాదకరంగా సాగే ఈ పరుగులో పాల్గొనేందుకు ఇప్పటివరకు 1000 మంది తమ పేర్లు ఆన్లైన్లో నమోదు చేసుకున్నారని వివరించారు. పరుగులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఒక టీ - షర్ట్, ఫినిషింగ్ మెడల్, న్యూట్రిషన్ సపోర్ట్ అందజేయడంతో పాటు అవసరమైన వైద్య సదుపాయం ఏర్పాటు చేశామన్నారు. 13న జరిగే పోస్ట్ ఇండియా రనకు ప్రత్యేక ఆహ్వానితులుగా గుంటూరు శాసనసభ్యులు గళ్లా మాధవి, నజీర్ అహ్మద్‌తో పాటు కలెక్టర్, ఎస్పీలు కూడా హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఎస్ఆర్ఎం వర్సిటీలో జరిగిన టీ-షర్ట్, పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పోస్టల్ అధికారులతో పాటు ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, ఇంజనీర్ - ఇన్-చీఫ్ నయిముల్లా, గుంటూరు డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ యల్లమందయ్య తదితరులు పాల్గొన్నారు.


Similar News