AP News:‘పత్తి కొనుగోళ్లలో ఇబ్బందులు పరిష్కరించాలి’.. మంత్రి పెమ్మసాని కీలక ఆదేశాలు

'పత్తి కొనుగోలు పారదర్శకంగా జరగాలి. పత్తిలోని తేమ పరీక్షల్లో తేడాలు రావడం వలన రైతులు ఇబ్బంది పడుతున్నారు.

Update: 2024-11-15 12:58 GMT

దిశ ప్రతినిధి,గుంటూరు: 'పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా జరగాలి. పత్తిలోని తేమ పరీక్షల్లో తేడాలు రావడం వలన రైతులు ఇబ్బంది పడుతున్నారు. సీసీఐ కొనుగోలు చేయాల్సిన పత్తి దళారుల పాలు కాకూడదు. రైతు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది' అని గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కుర్నూతల గ్రామంలో గల సీ.సీ.ఐ ఆధ్వర్యంలో గాయత్రి జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు గారితో కలిసి పెమ్మసాని గారు శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. కార్యక్రమంలో ముందుగా రైతులతో మాట్లాడుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కొనుగోలు సమయంలో మాయిశ్చరైజ్ టెస్టులలో సమస్యలు ఉన్నాయని రైతులు తెలియజేశారు. కాగా అధికారులతో దగ్గరుండి మాయిశ్చరైజ్ పరీక్షలు పెమ్మసాని గారు చేయించారు. పరీక్షల్లో తేమ శాతం లో మార్పు ఉండడాన్ని గమనించిన ఆయన అధికారులతో మాట్లాడుతూ .. వాతావరణం అనుకూలంగా లేని సమయంలో రైతులను ఇబ్బంది పెట్టకుండా కొనుగోళ్లలో వేగం పెంచాలి.' అని సూచించారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో కంప్లైంట్ బాక్స్, టోల్ ఫ్రీ నెంబర్లను వెంటనే ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ గారికి ఆదేశించారు. అలాగే విత్తనాలు, ఫెర్టిలైజర్స్ కల్తీ చేస్తున్న వారిని కూడా ఆయన హెచ్చరించారు. రైతులను మోసం చేస్తే ఊరుకునేది లేదని, వెంటనే పద్ధతి మార్చుకోవాలని చెప్పారు. త్వరలో తాను నకిలీ ఫెర్టిలైజర్స్, ఎరువులపైనా దృష్టి సారించబోతున్నానని ఈ సందర్భంగా పెమ్మసాని గారు తెలియజేశారు.


Similar News