Organ Donation:అవయవదాతలకు గౌరవంగా వీడ్కోలు.. ప్రభుత్వం తరఫున అంత్యక్రియలు

బ్రెయిన్ డెడ్‌తో మరణించి అవయవదానంతో పలువురికి జీవదాతలుగా నిలిచిన వారి పార్థివ దేహాల‌కు గౌరవప్రదమైన వీడ్కోలు తెల‌పాల‌ని, వారి కుటుంబాల‌కు రూ.10 వేలు పారితోషికాన్ని అందజేయాల‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచించింది.

Update: 2024-08-09 01:50 GMT

దిశ, ఏపీ బ్యూరో:బ్రెయిన్ డెడ్‌తో మరణించి అవయవదానంతో పలువురికి జీవదాతలుగా నిలిచిన వారి పార్థివ దేహాల‌కు గౌరవప్రదమైన వీడ్కోలు తెల‌పాల‌ని, వారి కుటుంబాల‌కు రూ.10 వేలు పారితోషికాన్ని అందజేయాల‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను వివరిస్తూ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం త‌ర‌ఫున ఆయా జిల్లాల్లో జిల్లా క‌లెక్టర్ లేదా ఎస్పీ సంబంధిత వ్యక్తి అంత్యక్రియ‌ల‌కు హాజర‌వ్వాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చొర‌వ‌తో గురువారం ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

వారి కుటుంబ సభ్యులకు సత్కారం..

అవయవ దాతల కుటుంబ సభ్యుల్ని గౌరవిస్తూ వారిని శాలువా, ప్రశంసాపత్రం, పుష్పగుచ్ఛాలతో సత్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అవయవ సేకరణ అనంతరం భౌతిక కాయాన్ని తగిన సమయంలో సగౌరవంగా అంతిమ సంస్కారాలను నిర్వహించాల్సి వుంటుందన్నారు. దాతకు సంబంధించిన ఫొటోతో ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలతో జిల్లా కలెక్టర్ పత్రికా ప్రకటన జారీ చేయాలని కృష్ణబాబు తన ఆదేశాల్లో తెలిపారు.


Similar News