వైసీపీ ఎన్నికల ప్రచారంలో సలహాదారులేరీ?

వైసీపీ అధికారంలోకి వచ్చి రాగానే డజన్ల సంఖ్యలో సలహాదారుల నియామకాలు జరిగిపోయాయి.

Update: 2024-05-08 02:45 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: వైసీపీ అధికారంలోకి వచ్చి రాగానే డజన్ల సంఖ్యలో సలహాదారుల నియామకాలు జరిగిపోయాయి. ఇంకా రెండు మూడు నెలలే గడువు వుందనగా కూడా 2024లో కూడా నియామకాలు జరుగుతూనే వున్నాయి. ఇలా నియమితులైన వారి సంఖ్య భారీగానే వున్నా ప్రభుత్వం నుంచి నెలకు మూడున్నర లక్షల జీతం, ఇతర ఖర్చులతో కలిపి ఏడు లక్షల వరకు తీసుకునే వారి సంఖ్య 40 మంది వరకు ఉంటుంది. ఎమ్మెల్యేలు, మంత్రులకు వచ్చే జీతభత్యాల కంటే వీరికిచ్చేదే ఎక్కువ. పైగా ప్రభుత్వంలో, పార్టీలో వీరి హవా కూడా ఎక్కువే. అయితే, కీలకమైన ఎన్నికల సమయంలో మాత్రం సజ్జల రామకృష్ణా రెడ్డి వంటి ముగ్గురు నలుగురు తప్ప మిగిలిన సలహాదారులు దుర్భిణి వేసి వెతికినా కనిపించడం లేదు. వీరి పేరు వినిపించడమే లేదు. జనంలోకి పార్టీ తరపున ప్రత్యక్షంగా, పరోక్షంగా వెళుతున్నది లేదు. చాలా మంది ఎన్నికలకు ముందు పదవులలోనుంచి తప్పుకొన్నారు. ఆ సాకుతో పార్టీ మొహం చూడడం లేదు.

మేధావుల కోటాలో వచ్చిన వారు మౌనమేనా?

పలువురు వివిధ రంగాల్లో నిపుణుల పేరిట, మేధావుల పేరిట సలహాదారులుగా ప్రభుత్వంలో దూరారు. అధికారాన్ని, పదవిని అనుభవించారు. తీరా ఎన్నికల సమయం వచ్చేప్పటికి, వైసీపీ ఇబ్బందులు ఎదుర్కొనేప్పటికీ ఎక్కడా కనిపించడం లేదు. కనీసం ప్రత్యక్షంగా ప్రజల్లోకి రాకపోయినా, ప్రచారంలో పాల్గొనకపోయినా తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసి కూడా వైసీపీకి సాయం చేయడం లేదు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం పై తీవ్ర విమర్శలు వస్తున్న క్రమంలో, ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేస్తున్న సయమంలో, ప్రభుత్వ నిర్ణయాలు వివాదాస్పదమవుతున్న సందర్భంలో వీరు ఎక్కడ గళం విప్పడం లేదు.

ఆ ఛానల్‌లో మాట్లాడితే పని అయిపోయినట్లేనా?

ప్రభుత్వంలో అత్యధిక ప్రాధాన్యత పొందిన సదరు సలహాదారులంతా అయితే వైసీపీకి చెందిన ఛానల్‌లో కనిపిస్తారు. అక్కడ మాట్లాడేసి ఇక తమ పని అయిపోయిందనిపిస్తారు తప్ప బయటకు రారు. భూ చట్టం మీద సజ్జల తో పాటు అజేయ కల్లం మాట్లాడారు. పలు సమావేశాల్లో పాల్గొన్నారు. మీడియా నుంచి వచ్చిన పలువురు సలహాదారులు మాత్రం ఆ కష్టకాలంలో ఎక్కడా కనిపించడమే లేదు. చివరకు వైసీపీ ఇబ్బందులు పడుతున్న సమయంలో కూడా మాట్లాడటం లేదు. పలువురు హాయిగా నాలుగేళ్లు, నాలుగున్నర సంవత్సరాలు పదవిని అనుభవించి తామ పదవీ కాలం అయిపోయినందున బయటకు రావడం లేదని సంజాయిషీలు ఇచ్చుకుంటున్నారు. ఇటువంటి వారికా జగన్ పదవులు ఇచ్చింది అని నాయకులు, కార్యకర్తలు గొణుక్కొంటున్నారు.

Tags:    

Similar News