రేపటి నుంచి వారికి ఉచిత బస్సులు.. మంత్రి కీలక ప్రకటన
రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. పదో తరగతి పరీక్షల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు స్థానిక అధికారులు తెలిపారు. అలాగే స్వచ్ఛంద సంస్థలు సైతం విద్యార్థులకు పరీక్ష కేంద్రాలకు తరలించేందుకు రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ఉచితంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
అరగంట ముందుగానే ఎగ్జామ్ సెంటర్లకు చేరుకొని జయప్రదంగా పరీక్షలు రాయాలన్నారు. టెన్త్ ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థుల వద్ద బస్ పాస్ లేకపోయినా.. వారి హాల్‌టికెట్ చూసి పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ఎక్కించుకోవాలని తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలని సూచించారు. తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకాంక్షించారు. రేపటి(సోమవారం) నుంచి 6.15లక్షల మంది టెన్త్ పబ్లిక్ పరీక్షలు రాయబోతున్నారు.