ఆ విషయంలో వాళ్లను వదిలిపెట్టను.. జేసీ ప్రభాకర్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ..
దిశ, వెబ్ డెస్క్: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. గత ప్రభుత్వంలో తన బస్సులను బ్రేక్ ఇన్ స్పెక్టర్లు అక్రమంగా సీజ్ చేశారంటూ తీవ్రంగా మండిపడ్డారు. ప్రస్తుతం తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడంతో ఆయన ప్రతీకారం తీర్చుకుంటానంటూ హెచ్చరించారు. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబుకు చెడ్డు పేరు వస్తుందనుకుంటే టీడీపీకి రాజీనామా చేస్తానని ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు.
కాగా 2019 ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి పోటీ చేయలేదు. ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి నుంచి తొలిసారి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి విజయం సాధించారు. దీంతో తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. అనంతరం చైర్మన్ పదవిని చేపట్టారు. అయితే తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల మధ్య తరుచూ ఘర్షణలు జరిగాయి. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన ట్రావెల్ బస్సులను సీజ్ చేశారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేశారు. అయినా సరే బస్సులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బస్సులను బయట తిరగకుండా చేశారు. ఇదంతా పెద్దారెడ్డి ఆదేశాలతో తన బస్సులను బ్రేక్ ఇన్‌స్పెక్టర్లు సీజ్ చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి అప్పట్లో బహిరంగంగా కామెంట్స్ చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరినీ వదలమని హెచ్చరించారు.
తాజాగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో తన బస్సులను సీజ్ చేసిన బ్రేక్ ఇన్‌స్పెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సుల సీజ్ విషయంలో ఎవరినీ వదిలిపెట్టనని హెచ్చరించారు. బ్రేక్ ఇన్‌స్పెక్టర్లు తన కాళ్లు పట్టుకుని తన బస్సులను రిపేర్లు చేయించాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వంలో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. తనను, తన కుటుంబ సభ్యులను దొంగేళ్లుగా చూశారంటూ కన్నీటిపర్యంతమయ్యారు. బస్సులను సీజ్ చేశారని, తమను అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీటీసీ శివప్రసాద్, బ్రేక్ ఇన్‌స్పెక్టర్లను వదలనని హెచ్చరించారు. ఇందుకోసం తాను ఎంత దూరమైనా వెళ్తానని చెప్పారు. తన బస్సులు చేయడంపై 10 రోజుల్లో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు చెడ్డ పేరు వస్తుందనుకుంటే పార్టీకి, పదవులకు తాను రాజీనామా చేస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.