Cm Jagan నిర్ణయాన్ని సమర్థించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాలపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు....
- బహిరంగ సభలు ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి
- ప్రతీ నిర్ణయాన్ని వ్యతిరేకంగా చూడాల్సిన అవసరం లేదంటూ కీలక వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేసిన జీవో నెం1 పై ప్రతిపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి. రోడ్లపై బహిరంగ సభల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి రద్దు చేసింది. దాదాపుగా అన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. చంద్రబాబు, పవన్ కల్యాణ్ సభలు జరగకూడదనే ఉద్దేశంతో చీకటి జీవోలు విడుదల చేశారంటూ మండిపడుతున్నాయి. మరోవైపు బీజేపీ సైతం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాలపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో తప్పు లేదని అభిప్రాయపడ్డారు. రోడ్లపై బహిరంగంగా సభలు ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వం అనుమతి తప్పనిసరని పేర్కొన్నారు. ముందస్తుగా అనుమతి కోరితే అక్కడి పరిస్థితులకు అనుగుణంగా పోలీసు శాఖ అనుమతి ఇవ్వటంతో పాటుగా అవసరమైన చర్యలు తీసుకుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిర్ణయాలు చేయటం అధికారుల బాధ్యతగా పేర్కొన్నారు. ప్రతీ నిర్ణయాన్ని వ్యతిరేకంగా చూడాల్సిన అవసరం లేదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.