'వంగవీటి రంగా హత్యలో చంద్రబాబు ప్రమేయం ఉంది'
ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రంగా వర్థంతి సందర్భంగా గుడివాడ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం నాని నివాళ్లర్పించారు.
దిశ, వెబ్డెస్క్: ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రంగా వర్థంతి సందర్భంగా సోమవారం గుడివాడ నియోజకవర్గ కేంద్రంలో రంగా చిత్రపటానికి పూలమాల వేసి నాని నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రంగా హత్యలో టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ నేతల ప్రమేయం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. రంగా చావుకు కారణమైన వ్యక్తులు ఆయన బూట్లు నాకుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రంగా పేరు చెప్పుకోకుండా రాజకీయం చేయలేని దుస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉందని ఎద్దేవా చేశారు. రావి వెంకటేశ్వరరావు రంగాపై ప్రేమ ఇప్పుడు పుట్టుకొచ్చిందా? అని ప్రశ్నించారు. రాజకీయంగా రంగాను తొక్కేయాలని టీడీపీ నేతలు అడుగడుగునా ప్రయత్నించారని, అది సాధ్యంకాక భౌతికంగా అడ్డుతొలగించుకున్నారని మండిపడ్డారు. ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో రంగా చావుకు కారణమైన వ్యక్తులు దిగజారి మాట్లాడుతున్నారని సీరియస్ అయ్యారు. ఇప్పటికే రంగా హత్యకు టీడీపీ నేతలే కారణమని ఎంతో మంది చెప్పారని గుర్తుచేశారు. రంగా కుటుంబంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, ఆయన ఆశయాల కోసం కృషి చేస్తామని అన్నారు.