అది పబ్లిసిటీ స్టంట్‌ మాత్రమే: విజన్‌-2047పై జగన్ సంచలన ట్వీట్

విజన్‌-2047 పేరుతో సీఎం చంద్రబాబు మరో మారు పబ్లిసిటీ స్టంట్‌కు దిగారని ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు...

Update: 2024-12-15 13:22 GMT

దిశ, వెబ్ డెస్క్: విజన్‌-2047 పేరుతో సీఎం చంద్రబాబు(Cm Chandrababu) మరో మారు పబ్లిసిటీ స్టంట్‌కు దిగారని ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(AP Former CM Jagan Mohan Reddy) అన్నారు. ప్రజలను మభ్యపెట్టడానికి, మాయచేడానికి ఇదొక ఎత్తుగడ మాత్రమేనని ఆయన ట్వీట్ చేశారు. చంద్రబాబు పత్రంలో రాష్ట్రం, ప్రజల అవసరాలకు చోటేలేదని, వాస్తవిక దృక్పథం అంతకన్నా లేదని విమర్శించారు. మేనిఫెస్టో హామీల అమలుపై చంద్రబాబు పాలన ఉండదని ఎద్దేవా చేశారు. ఎప్పుడూ ప్రజలను మోసం చేయడంమీదనే, ప్రజలను మాయ చేయడం మీదనే తన ధ్యాసంతా ఉంటుందని జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు.

1998లో కూడా చంద్రబాబు విజన్‌-2020 పేరిట డాక్యుమెంట్‌ విడుదల చేశారని ట్వీట్‌లో జగన్ గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో అదొక చీకటి అధ్యాయమని విమర్శించారు. రైతుల ఆత్మహత్యలు, పనులకోసం వలసలు, ఉపాధిలేక, ఉద్యోగాల్లేక అష్టకష్టాలు, వీటన్నింటినీ దాచేసి చంద్రబాబు తన విజన్‌ చుట్టూ నడిపించిన ప్రచారం అంతా ఇంతా కాదన్నారు. ప్రైవేటీక‌ర‌ణ పేరుతో ప్రభుత్వ విలువైన ఆస్తులను పప్పుబెల్లాల మాదిరిగా తన మనుషులకు కట్టబెట్టి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆ రోజుల్లో స్విట్జర్లాండ్‌కు చెందిన అప్పటి ఆర్థిక మంత్రి పాస్కల్‌ హైదరాబాద్‌ వచ్చిన సందర్భంలో విజన్‌ డాక్యుమెంట్లు పేరిట ఇలా అబద్ధాలు చెప్పేవారిని, భారత దేశంలో అయితే జైలుకో లేకపోతే ఆస్పత్రికో పంపిస్తామని కామెంట్‌ చేశారని తెలిపారు. చివరకు ప్రజలు కూడా విజన్‌-2020 కాదని, “420’’ అంటూ చంద్రబాబును దుయ్యపట్టారని చెప్పారు. 2014లో కూడా చంద్రబాబుగారు విజన్‌-2029 డాక్యుమెంట్‌ ప్రచార ఆర్భాటంగానే మిగిలిపోయిందని జగన్ వ్యాఖ్యానించారు. 

Tags:    

Similar News