Flash Floods: ముంచుకొస్తోన్న గండం.. ఆంధ్రా జిల్లాల్లో అల్లకల్లోలం

ఏపీలో, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వరదలు పోటెత్తాయి. చెరువుల కట్టలు తెగిపోవడంతో గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి.

Update: 2024-10-22 06:27 GMT

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది తూర్పు మధ్య బంగాళాఖాతంలో పారాదీప్ కు 730 కిలోమీటర్లు, బెంగాల్ ఐలాండ్ కు 770 కిలోమీటర్లు, బంగ్లాదేశ్ కేపు పారాకు 740 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ (IMD) వెల్లడించింది. ఇది క్రమంగా బలపడుతూ రేపటికి తుపానుగా మారనుంది. దీనికి ఐఎండీ దానాగా నామకరణం చేయనుంది. తుపాను తీరం వైపు పయనించే కొద్దీ దాని తీవ్రత పెరుగుతుందని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది వాతావరణశాఖ అధికారులు తెలిపారు. సముద్ర తీరప్రాంతాల్లో ఎవరూ ఉండొద్దని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఎల్లుండి పూరీ - సాగర్ ద్వీపం మధ్య తీరందాటే అవకాశం ఉందని, ఆ సమయంలో గంటకు 100-110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.

వాయుగుండం ప్రభావంతో ఏపీవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కృష్ణా, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులు, వాగులు కట్టలు తెంచుకుని ఊళ్లను ముంచెత్తుతున్నాయి. అనంతపురంలో కనగానపల్లి చెరువుకట్ట తెగడంతో పండమేరు ఉద్ధృతి పెరిగింది. నగరంలో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. హైదరాబాద్ - బెంగళూరు హైవేపైకి వరదనీరు చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామాల మధ్య రవాణా నిలిచిపోయింది.

చిత్తూరు జిల్లా తవణంపల్లిలో కురిసిన భారీ వర్షానికి బహుదానదికి వరద పోటెత్తింది. తొడతర సమీపంలో బహుదానదిపై వంతెన కొట్టుకుపోవడంతో రాకపోకలు స్తంభించాయి. 5 గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తాత్కాలికంగా రాకపోకలు సాగించేందుకు అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు.

మరోవైపు ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం వినగడప కట్టలేరు వాగు ఉద్ధృతిగా ప్రవహిస్తోంది. దీంతో డైవర్షన్ రోడ్డుపై టిప్పర్ లారీ, ఇతర వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తెలంగాణలో కురుస్తోన్న వర్షాలకు తోటమూల - వినగడప మధ్యనున్న వంతెనపైకి వరదనీరు చేరింది. అటువైపు వెళ్తున్న టిప్పర్ లారీ వరదనీటిలో చిక్కుకుపోయింది. 20 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇటీవలో విజయవాడలో సంభవించిన వరదలు మిగిల్చిన నష్టం నుంచి తేరుకోకుండానే.. రాష్ట్రాన్ని మరోసారి వరదలు ముంచెత్తుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 


Similar News