కృష్ణానదికి భారీ వరద.. హెచ్చరికలు జారీ చేసిన ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ

కృష్ణానదికి వరద ప్రవాహం పెరుగుతుండటంతో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ప్రకాశం బ్యారేజీ నుంచి 2 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేశారు.

Update: 2024-10-22 07:03 GMT

దిశ, వెబ్ డెస్క్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి వరద పోటెత్తింది. నదికి వరద ప్రవాహం అంతకంతకూ పెరగుతుండటంతో.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి 2.06 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమయంలో ఎవరూ నదిని దాటే ప్రయత్నం చేయరాదని హెచ్చరించారు. వరదల హెచ్చరికల నేపత్యంలో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. మురుగునీటి కాల్వలు, కల్వర్టులకు దూరంగా ఉండాలని, విద్యుద్ఘాతానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అలాగే భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడైనా ఓపెన్ మ్యాన్ హోల్స్ కనిపిస్తే అక్కడ ఎర్రటి జెండాలు లేదా బారికేడ్లను పెట్టాలని సూచించారు. వరదనీటిలో వాహనాలను నడిపే సాహసాలు చేయరాదన్నారు.

వరదల కారణంగా .. ఇంటింటికీ పంపులద్వారా సరఫరా చేసే నీరు కలుషితం అవుతుందని, కాబట్టి త్రాగునీటిని వేడిచేసుకుని తాగాలని సూచించారు. వరదల కారణంగా ఇళ్లు మునిగి ఖాళీ చేయవలసి వస్తే విలువైన వస్తువుల్ని జాగ్రత్త చేసుకోవాలని తెలిపారు. వరదలు తగ్గిన తర్వాత ఇంటి పరిసరాల్లో క్రిమిసంహారక మందులు, బ్లీచింగ్ చల్లడం మరచిపోవద్దని సూచించారు. 


Similar News