Prakasam Barrage: కృష్ణానది పరివాహక ప్రజలకు స్వల్ప ఊరట
ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం తగ్గింది....
దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం తగ్గింది. ఎగువన కురిసిన వర్షాలకు విజయవాడలో కృష్ణా నది ఉధృతిగా ప్రవహించింది. ఇప్పటికే బుడమేరు వాగు పొంగి విజయవాడ నగరంలో బీభత్సం సృష్టించింది. సింగ్‌నగర్, ప్రకాశ్ నగర్, చిట్టీనగర్, మొగల్రాజపురంతో పాటు చాలా ప్రాంతాల్లో బుడమేరు వాగు నీరు భారీగా చేరింది. దీంతో ఇళ్లు, రోడ్లు జలమయమయ్యాయి. సీఎం చంద్రబాబు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థితులపై పర్యవేక్షిస్తున్నారు. బాధితులకు సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు
అయితే ఎగువ నుంచి వస్తున్న నీటితో ప్రకాశం బ్యారేజీకి ఇప్పటి వరకూ వరద నీరు పోటెత్తింది. దీంతో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం వరద నీరు ప్రవాహం స్వల్పంగా తగ్గింది. దీంతో బ్యారేజీ పరివాహక ప్రజలకు కొంత ఊరట లభించింది. ఇప్పటికే బ్యారేజీ 70 గేట్లు ఎత్తి 11.27 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. కాలువలకు 801 క్యూసెక్కుల నీటిని రిలీజ్ చేశారు. ప్రస్తుతం బ్యారేజీ నీటిమట్టం 23.7 అడుగులుగా ఉంది. ఈ మేరకు రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. బ్యారేజీకి వరద ప్రవాహం తగ్గినా కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.