గండం గట్టెక్కినా.. ఇళ్లను ముంచేసిన రాకాసి అలలు

వాయుగుండం తీరందాటినా.. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో.. అధికారులు అప్రమత్తమయ్యారు.

Update: 2024-10-17 06:19 GMT

దిశ, వెబ్ డెస్క్: వాయుగుండం తీరందాటడంతో.. గండం గట్టెక్కింది.. హమ్మయ్య అనుకున్నారు అంతా. కానీ.. వాయుగుండం తీరందాటినా.. సముద్ర తీరంలో రాకాసి అలలు ఎగసి పడుతున్నాయి. కోనసీమ జిల్లా అంతర్వేది తీరంలో, కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో, విశాఖ జిల్లాలోని యారాడ తీరంలో అలల ఉద్ధృతి పెరిగింది. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో.. మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు అధికారులు. అంతర్వేదిలో గోదావరి సముద్ర సంగమం వద్ద అలలు ఎగసిపడ్డాయి. బీచ్ రోడ్డు మునిగింది. పల్లిపాలెంలో ఇళ్లను సముద్రపు నీరు చుట్టుముట్టింది. ఓఎన్జీసీ ప్లాంటులోకి సైతం సముద్రపు నీరు చేరింది. టెర్మినల్ గేటును సముద్రపు అలలు తాకడంతో.. సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆక్వా చెరువులను కూడా సముద్రం నీరు ముంచెత్తింది.

ఉప్పాడ తీరంలోనూ అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతుండగా.. ఆ మార్గంలో వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు. రాకాసి కెరటాల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలగా.. ఇళ్లలోకి కూడా నీరు చేరింది. యారాడ బీచ్ 50 మీటర్లు ముందుకు వచ్చింది. విశాఖపట్నం, గంగవరం పోర్టుల్లో 1వ ప్రమాద హెచ్చరిక, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

ఆకస్మిక వరదల హెచ్చరికలు..

తీరందాటిన వాయుగుండం అల్పపీడనంగా బలహీనపడగా.. దాని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్షసూచన చేసింది వాతావరణ శాఖ. భారీ వర్షాల నేపథ్యంలో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందన్న హెచ్చరికలు జారీ అవ్వడంతో.. ఆయా జిల్లాల యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఏ క్షణానైనా వరదలు వచ్చే సూచనలున్న నేపథ్యంలో.. తక్షణ సహాయకచర్యలకు రంగం సిద్ధం చేశారు. 

గడిచిన 24 గంటల్లో సాగర్ నగర్లో 12.4, మధురవాడలో 11.5, ఎంవీపీ కాలనీలో 11, పెనుకొండలో 10.6, తిరుపతిలో 9.8, నెల్లూరులో 8.8, కర్నూల్ లో 7.8, శ్రీకాకుళంలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.


Similar News