Ap News: ప్రభుత్వంపై మరోసారి ఉద్యోగుల లడాయి
వైసీపీ ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు పోరుబాటకు సై అంటున్నాయి. అంతేకాదు విమర్శల డోసును కూడా పెంచాయి...
దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు పోరుబాటకు సై అంటున్నాయి. అంతేకాదు విమర్శల డోసును కూడా పెంచాయి. తమ ఆవేదనను వెళ్లబుచ్చుతూనే ప్రభుత్వానికి చురకులు వేస్తున్నారు ఉద్యోగాల సంఘాల నేతలు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ జేఏసీ అమరావతి పోరుబాటకు పిలుపునిచ్చాయి. ఉద్యమంలో భాగస్వామ్యం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఒకవైపు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మరోవైపు చుట్టేస్తున్నారు. ఇక ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు రెడీ అంటున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఉద్యమానికి సిద్ధమైనట్లు ప్రకటించాయి. ఈనెల 9 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయనున్నట్లు ఏపీజేఏసీ అమరావతి ప్రకటించింది. ఇకపోతే ఏప్రిల్ నెలలో ఆందోళన చేపడతామని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. మరోవైపు తమ పోరాటానికి ఉద్యోగ సంఘాలు మద్దతు ఇవ్వాలని కూడా ఏపీజేఏసీ కోరుతుంది. దీంతో ఏపీ ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య మరోసారి లడాయి మొదలైంది.
దశల వారీగా ఉద్యమం
ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆర్ధిక, ఆర్ధికేతర సమస్యలను నాలుగేళ్లుగా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని బొప్పరాజు ఆరోపించారు. ఈనెల 9 నుంచి రాష్ట్రవ్యాప్త ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు చేస్తామని ప్రకటించారు. ఇలా ఏప్రిల్ 3 వరకు దశల వారీగా ఉద్యమం చేస్తామని వెల్లడించారు. విశాఖపట్నం రెవిన్యూభవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యమానికి ఉద్యోగులను సన్నద్ధం చేసేందుకు విశాఖ తరలివచ్చినట్లు తెలిపారు. ఉద్యోగుల జీతభత్యాలు చెల్లించేందుకు బడ్జెట్ కేటాయింపులు చేస్తే ఎందుకు తమ జీతాలు, పెన్షలు రెండేళ్లుగా ఒకటో తేదీనే ప్రభుత్వం చెల్లించలేక పోతున్నారో తెలియడం లేదన్నారు. తమ నిధులు తమకు కేటాయించి ఉంటే డీఏబకాయిలు, పీఆర్సీ బకాయిలు, రావల్సిన కొత్త డీఏలు, సరెండర్ లీవులు, ఎర్నడ్ లీవులు, తదితర చట్టబద్దంగా రావాల్సిన కోట్లాది రూపాయల బిల్లులు ఎందుకు సకాలంలో ఇవ్వడం లేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం అప్పటికీ స్పందించకపోతే ఏప్రిల్ 5న జరిగే కార్యవర్గ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
మా జీపీఎఫ్ డబ్బుల సంగతేంటి?
ఉద్యోగులు దాచుకున్న సుమారు రూ.3000కోట్ల జీపీఎఫ్ డబ్బులు కూడా ఉద్యోగుల కుటుంబ అవసరాలకు ఎందుకు చెల్లించడం లేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు నిలదీశారు. చట్టబద్ధంగా తమకు రావాల్సినవి, తాము దాచుకున్న డబ్బులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ జీపీఎఫ్ సంగతేంటని, అలా దాచుకోవడమే తమ నేరామా? అని బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. డీఏ అరియర్స్ లక్షలాది రూపాయలు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకున్నారని వాపోయారు. ‘వేల కోట్ల రూపాయల డీఏ బకాయిలు ఎందుకు సకాలంలో చెల్లించలేక పోతున్నారు?. సీపీఎస్ ఉద్యోగుల నుండి రికవరీ చేసిన డబ్బులు, ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం కలిపి ప్రభుత్వం వాడుకున్న రూ. 2,600 కోట్లు ఎప్పుడు ఆ ఉద్యోగుల ఖాతాలలో ఎప్పుడూ జమచేస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలి.’ అని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు వారం రోజులలోనే సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ పునరుద్దరిస్తామని ఇచ్చిన హామీఅమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధికరిస్తామని ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ , ఒరిస్సారాష్ట్రలలో మాదిరిగా వెంటనే క్రమబద్ధీకరించాలని కోరారు. ‘రాజకీయ నాయకులు ఎందుకు పెన్షన్ తీసుకుంటున్నారు?. మీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసుకోగలరా?.’ అంటూ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ‘ప్రజాప్రతినిధుల జీతాలను వారే నిర్ణయించుకుంటారు. వారికి పీఆర్సీలతో సంబంధం లేదా?. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పారు, ఎందుకు చేయలేదు. ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఉద్యోగిపైనా ఉంది.’ అని బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు.
గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం దూరం
ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఇచ్చిన నిరసన కార్యక్రమాలలో ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం పాల్గొనడం లేదని రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్ర రాజు వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఉద్యోగి, ఉద్యోగ సంఘ నాయకులపై నమ్మకం లేక చాలా అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. గతంలో పీఆర్సీ ఉద్యమంలో దేశ చరిత్రలోనే విజయవాడలో ప్రతి ఉద్యోగి పాల్గొనడం జరిగిందని, అయితే ఉద్యోగ సంఘాల పేరుతో ఏ ఉద్యోగికి న్యాయం జరగలేదని గుర్తు చేశారు. కొన్ని ఉద్యోగ సంఘాలు వారి యొక్క సొంత ప్రయోజనాల కోసం మళ్లీ ఉద్యోగులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు. దీన్ని ఉద్యోగస్తులు ఎవరు నమ్మే పరిస్థితులు లేరని, వీరిపై ఉన్న ఆరోపణలను, మాఫీ చేయించుకోవడానికి పైకి ఉద్యమం పేరుతో మీడియాలో, పేపర్లో, హడావుడి చేయడం, లోపాయికారిగా ప్రభుత్వ పెద్దలతో ఒప్పందాలు చేసుకోవడం వీరి యొక్క నైజం అని విమర్శించారు. ఏపీజేఏసీ అమరావతి ఇచ్చిన పిలుపులో ఉద్యమమే మొదలు పెట్టకుండా అప్పుడే ప్రభుత్వ పెద్దలు లిఖితపూర్వ హామీ ఇస్తే ఉద్యమాన్ని ఆపేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కనకదుర్గ అమ్మవారి సమక్షంలో అన్ని ఉద్యోగ సంఘాలు నాయకులు ప్రమాణం చేసి, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు ఉద్యోగుల పక్షాన ఉంటామని, అప్పటివరకు అవసరమైతే అన్ని జేఏసీల నాయకులు ఆమరణ నిరాహార దీక్ష కైనా వెనకాడమని , ఉద్యోగుల ప్రయోజనమే ముఖ్యమని ప్రమాణం చేయాలని భూపతిరాజు రవీంద్ర రాజు డిమాండ్ చేశారు.