Ap News: పాదయాత్రలో మత్స్యకారులకు నారా లోకేష్​ సంచలన హామీలు

సీఎం జగన్​కు బీసీలంటే చిన్నచూపని, అందుకే 26 వేల మందిపై కేసులు పెట్టారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు..

Update: 2023-12-09 17:31 GMT

దిశ, ఏపీ బ్యూరో: ‘సీఎం జగన్​కు బీసీలంటే చిన్నచూపు. అందుకే 26 వేల మంది బీసీలపై కేసులు పెట్టారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక బీసీ రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తాం.’అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్​ భరోసా నిచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా శనివారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను లోకేష్​ వివరించారు. ఈ సమస్యలపై లోకేష్​ స్పందిస్తూ చేపల వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే సాయం జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇవ్వడం లేదన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారులు వేటలో చనిపోతే సాయం కూడా ఇవ్వడం లేదని గుర్తు చేశారు. ఫార్మా, కెమికల్ కంపెనీల వ్యర్ధాలు సముద్రంలో కలవడంతో మత్స్య సంపద తగ్గిపోతుందని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు.

టీడీపీ హయాంలో బోట్లు, వలలు, జీపీఎస్, ఇతర సామగ్రి సబ్సిడీలో అందించామని లోకేష్ గుర్తు చేశారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఎటువంటి సబ్సిడీ ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. కాకినాడ సెజ్‌లో ఉన్న కంపెనీల్లో 70 శాతం స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. పైప్ లైన్ కారణంగా బోట్లు, వలలు నష్టపోతున్నా జగన్ ప్రభుత్వం ఎటువంటి నష్ట పరిహారం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోట్లకు ఇన్స్యూరెన్స్ లేకపోవడంతో మత్స్యకారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. టీడీపీ హయాంలో అమలైన బీమా పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని లోకేష్​ ప్రశ్నించారు. డీజిల్ సబ్సిడీ పెంచాలని, పెద్ద బోట్లకు 8 వేల లీటర్ల డీజిల్ ఇవ్వాలని లోకేష్​ డిమాండ్​ చేశారు.

మత్స్యకారుల కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలకు సహాయం చేస్తామని లోకేష్ హామీనిచ్చారు. డీజిల్ రేటు పెరిగిన మేరకు సబ్సిడీ పెంచుతామని భరోసానిచ్చారు. వేటకు వెళ్లి సముద్రంలో చనిపోతే డాక్టర్ సర్టిఫికెట్​ అవసరం లేకుండా పరిహారం అందిస్తామని లోకేష్​ మత్స్యకారులకు అభయమిచ్చారు

Tags:    

Similar News