ఏపీలో కోడ్ ఎఫెక్ట్.. కాటన్ దొర విగ్రహానికి ముసుగు
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఎన్నికల కోడ్ అమల్లో విచిత్రం నెలకొంది. ..
దిశ, వెబ్ డెస్: ఏపీలో ఎన్నికల నగరా మోగిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. దీంతో రాజకీయ నాయకుల గుర్తులను చెరిపివేస్తున్నారు. ప్రధానంగా పార్టీలు, నాయకుల ఫెక్సీలు తొలగిస్తున్నారు. అంతేకాక దివంగత నాయకుల విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారు. అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఎన్నికల కోడ్ అమల్లో విచిత్రం నెలకొంది. కోడ్ నేపథ్యంలో అమలాపురంలో రాజకీయ పార్టీలు, నాయకుల ఫెక్సీలు, ఫొటోలు తొలగించారు. అయితా అమలాపురం తహశీల్దార్ కార్యాలయంలో ఉన్న సర్ ఆర్ధర్ కాటన్ విగ్రహానికి కూడా ముసుగు వేశారు. దీంతో ఇదేం చిత్రమంటూ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సర్ ఆర్థర్ కాటన్ రాజకీయ నాయకుడు కాదని.. బ్రిటీష్ కాలంలో ధవళేశ్వరం ఆనకట్ట కట్టిన ఇంజినీర్ అని అంటున్నారు. ఎన్నోలక్షల ఎకరాలకు గోదావరి జిల్లాలు అందేలా చేసిన చిరస్మరణీయుడని చెబుతున్నారు. అలాంటి కాటన్ దొర విగ్రహానికి కూడా ముసుగు వేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కాటన్ దొర విగ్రహానికి ముసుగు తీయాలని కోరుతున్నారు.
అయితే మహాత్మా గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు మినహా మిగిలిన అన్ని విగ్రహాలకు ముగుసులు వేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయని అంటున్నారు. అందువల్లే సర్ ఆర్థర్ కాటన్ విగ్రహానికి ముసుగు వేశామని చెబుతున్నారు.