అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు
గ్రామీణ సంస్కృతికి దర్పణం పట్టే విధంగా సంక్రాంతి సంబరాలు జరిగాయి. ..
- పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు
- హాజరైన మంత్రి దాడిశెట్టి రాజా, ఎస్పీ రవీంద్రనాధ్ బాబు
దిశ, తుని: గ్రామీణ సంస్కృతికి దర్పణం పట్టే విధంగా సంక్రాంతి సంబరాలు జరిగాయి. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తునిలో శనివారం నిర్వహించిన సాంప్రదాయ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. శ్రీ రాజా కాలేజ్ మైదానంలో పెద్ద ఎత్తున నిర్వహించిన సంక్రాంతి సంబరాలను జిల్లా ఎస్పీ రవీంద్రబాబుతో కలిసి రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆంధ్రా సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే విధంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. పల్లెల్లో ఆదాయం కల్పించే సాంప్రదాయ కోళ్ల పెంపకం, గొర్రెల పెంపకం, రైతులు ఉపయోగించే ఎడ్ల బండ్లు, చిరుధాన్యాలు, సాంప్రదాయ పిండివంటలు, పౌష్టిక ఆహారం స్టాల్స్‌లో ప్రదర్శించారు. యువతకు సాంప్రదాయ క్రీడలు నిర్వహించి విజేతలకు బహుమతుల ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి రాజా మాట్లాడుతూ ఆంధ్రా సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేసేందుకు సంక్రాంతి వేడుకలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. సంక్రాంతి రైతుల పండుగని గత మూడు సంవత్సరాలుగా రైతులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని మంత్రి వివరించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు, రైతులకు సరైన సమయంలో సమాచారాన్ని అందించేందుకు వీలుగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు, తుఫాన్ వల్ల నష్టపోయిన పంటనంతటిని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతన్నలను ప్రభుత్వం ఆదుకుందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ధాన్యానికి క్వింటాల్‌కు రూ.1530 రూపాయలు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం రైతాంగానికి భరోసా ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఏలూరి సుధారాణి, మార్కెట్ యార్డ్ చైర్మన్ మాకినీడి బాబు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అమ్మాజీ, కౌన్సిలర్లు, పట్టణ సీఐ నాగ దుర్గారావు, ఎస్సై గోపాలకృష్ణ, పెద్ద ఎత్తున యువతీ, యువకులు పాల్గొన్నారు.